బిల్లుల అందక లబోదిబోమంటున్న గుత్తేదారులు

Mar 10,2025 21:44

ప్రజాశక్తి – సాలూరురూరల్‌ : ఉపాధి హామీ పథకం కింద గ్రామాల్లో పల్లె పండుగ పేరుతో కూటమి ప్రభుత్వం సిసి రోడ్లు, డ్రైనేజీలకు పుష్కలంగా నిధులు ఉన్నాయని, పనులు ఎవరు చేసినా వారం, పది రోజుల్లో బిల్లులు చెల్లిస్తామని స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు చెప్పినప్పటికీ నేటి వరకు బిల్లులందక గుత్తేదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ప్రతి గ్రామంలో మౌలిక సదుపాయాల నిమిత్తం సిసి రోడ్లు, డ్రైనేజీలను నిర్మించడానికి కూటమి ప్రభుత్వంకంకణం కట్టుకున్నది ఎంతో గొప్పగా ప్రచారం చేసుకుంది. అక్కడి వరకు బాగానే ఉంది. ఈ పనులు ఎంత తొందరగా చేస్తే అంత తొందరగానే బిల్లులు చేస్తామని చెప్పడంతో తమ ప్రభుత్వంలో ఇంతక ముందు ప్రభుత్వం వలె బిల్లులకు ఇబ్బందులు ఉండవని గుత్తేదారులు అప్పులు చేసి మరీ ఈ పనులు మొదలుపెట్టారు. తీరా పనులు పూర్తయ్యాక బిల్లులు అందక, తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టకలేక లబోదిబోమంటూ తమ బాధలను ఎవరికి చెప్పుకోవాలో, ఏం చేయాలో అన్న సందిగ్ధ స్థితిలో ఉన్నారు. ముఖ్యంగా ఉపాధి హామీ మెటీరియల్‌ కంపొనెంట్‌ కింద జరిగిన పనులకు, బిల్లులకు ఇబ్బందులు ఉండవన్న ధీమాతో అధికారులు చెప్పిన నిర్థిష్ట సమయంలో పనులు ముగించారు. తీరా పనులు చేసి ఇప్పుడు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా బిల్లులు మాత్రం చెల్లించడం లేదని వాపోతున్నారు. మండలం మొత్తం మీద దాదాపు రూ.2.20కోట్లు పనులు జరిగినా, వీటికి సంబంధించిన బిల్లులు మంజూరు కాలేదు. డిసెంబర్‌ రెండు, మూడు వారాల్లో పనులు ముగించినా మార్చి చివరికి వస్తున్నా ఇప్పటి వరకు బిల్లులు చెల్లించకపోవడంతో నిధులు మరుగున పడతాయన్నది మరో భయంతో ఉన్నారు. డిసెంబర్‌ 31వ నాటికి నిధులు ఖర్చు చేయాలని అధికారులు కాంట్రాక్టులపై ఒత్తిడి తెచ్చి మరి ఆ పనులు చేయించినా నేటికీ ఆ పనులకు బిల్లులు చెల్లించకపోవడంతో తెచ్చిన అప్పులకు వడ్డీలు పెరిగిపోతాయన్న భయంతో కాంట్రాక్టులు విలవిలాడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు స్పందించి తక్షణమే బిల్లులు ఇప్పించాలని కాంట్రాక్టర్లు కోరుతున్నారు.

➡️