ప్రజాశక్తి – పార్వతీపురం : జీడి పిక్కల కు గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతూ ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యాన గత మూడు నెలలుగా చేపట్టిన ఆందోళనలు అరణ్యరోదనగానే మిగిలాయి. ఈ ఏడాది జనవరి నుంచి జీడిపిక్కలకు గిట్టుబాటు ధర కల్పించాలని గిరిజన సంఘం ఆధ్వర్యాన గిరిజనులు కోరుతున్నారు. ఆందోళన, ధర్నాలు చేసినప్పుడల్లా ఐటిడిఎ పిఒ, జిల్లా కలెక్టర్ జీడి పిక్కల కొనుగోలుకు చర్యలు తీసుకుంటున్నామని చెపుతూ కాలక్షేపం చేశారు. వన్ దన్ వికాస కేంద్రాల ద్వారా కొనుగోలు చేస్తామని, విడివికెల సభ్యులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని కహానీలు చెప్పారు. పార్వతీపురం మార్కెట్ యార్డులో జీడి పిక్కల ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేస్తున్నామంటూ కట్టుకథ చెప్పుకొచ్చారు. గత నెలరోజులుగా జిల్లాలో జీడి పిక్కల కొనుగోళ్లు జరుగుతున్నాయి. గిరిజనులు సేకరించిన జీడి పిక్కలను ఎక్కువ కాలం ఇళ్లల్లో నిల్వ చేసుకోలేక అవసరాలకు అమ్ముకునే ప్రయత్నం చేస్తున్నారు. ఐడిడిఎ ఆధ్వర్యాన విడివికెలు జీడిపిక్కలు కొనుగోలు చేస్తాయని ఎదురు చూసిన గిరిజన రైతులకు నిరాశే మిగిలింది. కిలో జీడి పిక్కలను 200 రూపాయలకు కొనుగోలు చేయాలని ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యాన గిరిజనులు డిమాండ్ చేశారు. కొనుగోలు సీజన్ ప్రారంభమైనా ఇంతవరకు విడివికెల ద్వారా కొనుగోలుకు సంబంధించి ఎలాంటి అతీగతీ లేదు. దీంతో గిరిజనులు ప్రయివేటు వ్యాపారులకు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే గిరిజనులు సేకరించిన జీడి పిక్కలల్లో 60శాతం ప్రయివేటు వ్యాపారుల చేతుల్లోకి వెళ్లిపోయింది.కిలో జీడి పిక్కల ధర 150రూపాయలేజిల్లాలో ప్రయివేటు వ్యాపారులు కారుచౌకగా జీడిపిక్కలు కొనుగోలు చేస్తున్నారు. కిలో జీడి పిక్కలను రూ.150 నుంచి రూ.160కు కొనుగోలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సరుకు నాణ్యతని బట్టి వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. పార్వతీపురం ఐటిడిఎ పరిధిలోని 8 గిరిజన మండలాల్లో సుమారు 60వేల ఎకరాల్లో జీడితోటల సాగు జరుగుతోంది. ఈ ఏడాది వాతావరణ పరిస్థితులు, దిగుబడి పెంచేందుకు ఐటిడిఎ ఉద్యానవన అధికారులు తగిన సాయం చేయకపోవడంతో 50శాతమే దిగుబడి జరిగినట్లు తెలుస్తోంది. కిలో జీడి పిక్కలను రూ.200కు కొనుగోలు చేయాలన్న గిరిజనుల డిమాండ్ అందని ద్రాక్ష లా మిగులుతోంది.ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు పై కట్టుకథ ఇదిగో జీడి పిక్కలు విడివికెల ద్వారా కొనుగోలు చేస్తున్నాం, అదిగో జీడి ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేస్తున్నామంటూ ఇంతవరకు అధికారులు కట్టుకథలు చెప్పి గిరిజనులను మభ్యపెట్టారనే వాదనలు వినిపిస్తున్నాయి. విడివికె సభ్యులకు జీడి పిక్కలు, చింతపండు కొనుగోలుపై అవగాహన కల్పించేందుకు శిక్షణా కార్యక్రమాలు సాలూరు, కురుపాం, పార్వతీపురం కేంద్రాల్లో నిర్వహించారు. కొనుగోలు సీజన్ ముగుస్తున్నంత వరకు అధికారులు కాలయాపన చేస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.
గిరిజనులను మోసగిస్తున్న ఐటిడిఎ
జీడి పిక్కలకు గిట్టుబాటు ధర కల్పించేందుకు చర్యలు చేపడుతున్నట్లు ఐటిడిఎ అధికారులు చెపుతూ కాలయాపన చేస్తుండడం గిరిజనులను మోసం చేయడమే. ఇప్పటికే 60 శాతం జీడి పిక్కలను గిరిజనులు ప్రయివేటు వ్యాపారులకు విక్రయించారు. కిలో జీడి పిక్కలు రూ.150 నుంచి రూ.160కు వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. దీనివల్ల గిరిజనులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఏర్పడింది.కొల్లి గంగు నాయుడు, సిపిఎం జిల్లా కార్యదర్శి
