పార్వతీపురం, సాలూరు, పాలకొండ : మున్సిపల్ పారిశుధ్య, ఇంజినీరింగ్, పర్మినెంట్ కార్మికుల సమస్యల పరిష్కారం కోరుతూ మున్సిపల్ వర్కర్స్, ఎంప్లాయీస్ యూనియన్ (సిఐటియు) ఆధ్వర్యాన జిల్లాలోని పార్వతీపురం, సాలూరు, పాలకొండ మున్సిపల్ కార్యాలయాల వద్ద కార్మికులు సోమవారం ధర్నా చేశారు. అనంతరం మున్సిపల్ అధికారులకు వినతులను అందజేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ వర్కర్స్, ఎంప్లాయీస్ జిల్లా కార్యదర్శి ఎన్‌వై నాయుడు, నాయకులు జి.వెంకటరమణ, కాదా రాము మాట్లాడుతూ కరోనా కాలంలో పనిచేసిన కార్మికుల్ని తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని, పనిముట్లు సరఫరా చేయాలని, సంపూర్ణ పారిశుధ్య నివారణకు తగు సిబ్బంది నియమించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం అంగీకరించిన రిటైర్మెంట్ బెనిఫిట్స్, పదేళ్ల సర్వీసు ఉంటే రూ.75 వేలు, ఆపై ఒక్కొక్క ఏడాది రూ.2వేలు చెల్లించాలన్నారు. ప్రమాద మృతులకు రూ.7లక్షలు ఎక్స్‌గ్రేషియో, దహన సంస్కారాలకు రూ.20 వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు. చట్టబద్ధంగా జీతాలు, సెలవులు అమలు మొదలైన హామీలకు నేటికీ జీవోలు ఇవ్వలేదన్నారు. మున్సిపల్ కార్మికులకు ఉద్యోగ భద్రత లేకుండా చేస్తున్నారని, పర్మినెంట్ కార్మికులకు సరెండర్ లీవులు, జిపిఎఫ్ అకౌంట్లు, డిఏ బకాయిల వంటి సమస్యలు పరిష్కారం కావడం లేదని తెలిపారు. కార్మికులపై రాజకీయ వేధింపులు ఆపాలని అన్నారు. క్లాప్ డ్రైవర్లకు చట్టబద్ధంగా జీతాలు, సెలవులు అమలు కావడంలేదన్నారు. చనిపోయిన మృతుల కుటుంబాలకు ఉద్యోగం, నష్టపరిహారం చెల్లించాలన్నారు. సాలూరు మున్సిపల్ కార్యాలయంలో ఫర్నీచర్ దొంగతనంపై దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేశారు. పార్వతీపురంలో జరిగిన కార్యక్రమంలో ఆప్కాస్ విధాన కార్మికులు నాగవంశం శంకర్రావు, చీపురుపల్లి సింహాచలం, మామిడి శివ,బంగారు రాజేష్ ,నాగవంశం మల్లేష్, నాగవంశం నిర్మల, ఇప్పలమ్మ, పాపులమ్మ, గంగయ్యలు, పరిమిక వరదరాజు, పర్మినెంట్ కార్మికులు మంగళగిరి శ్రీను, గుంట్రెడ్డి గంగరాజు, నాగవంశం శివ, మేస్త్రీలు కోలా చంద్ర, సాసుబిల్లి శ్రీధర్, ఇంజనీరింగ్ కార్మికులు తాడ్డి వినరు, క్రాంతి, సాలూరులో జరిగిన కార్యక్రమంలో ఎపి మున్సిపల్ వర్కర్స్ ఫెడరేషన్ అధ్యక్ష కార్యదర్శులు టి.రాముడు, టి.శంకరరావు, వాటర్ ఇంజినీరింగ్ కార్మికులు రామ్‌చంద్, సంతోష్, పాలకొండలో ఎపి మున్సిపల్ వర్కర్స్ ఫెడరేషన్ పాలకొండ కమిటీ కార్యదర్శి సిహెచ్ సంజీవి, కోశాధికారి పి.వేణు, సిహెచ్ శ్రీదేవి, పడాల విమల, సింహాచలం, ఎన్. సాయి, పి.శ్రీనివాసరావు, రఘు పలువురు పారిశుధ్య కార్మికులు, క్లాప్ డ్రైవర్లు పాల్గొన్నారు.