నిజమైన హీరో భగత్ సింగ్

Mar 23,2024 16:23 #Manyam District

ప్రముఖ కవి, రచాయిత గంటేడ గౌరినాయుడు
ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో భాస్కర్ డిగ్రీ కళాశాలలో భగత్ సింగ్ వర్ధంతి సభ
ప్రజాశక్తి-పార్వతీపురం : బ్రిటిష్ ప్రభుత్వం భగత్ సింగ్ ను చంపినట్టుగానే ఈ నాటి ప్రభుత్వాలు ఆయన ఆలోచనలు కూడా చంపాలని అనేక ప్రయత్నాలు చేపడుతుండడం దేశ దౌర్భాగ్యమని ప్రముఖ కవి రచాయిత గంటేడ గౌరినాయుడు అన్నారు. భగత్ సింగ్ రాజ్ గురు సుఖదేవుల 93వ వర్ధంతి సందర్భంగా ఎస్ఎఫ్ఐ పార్వతీపురం కమిటీ ఆధ్వర్యంలో స్థానిక భాస్కర్ డిగ్రీ కళాశాలలో వర్ధంతి సభను నిర్వహించారు. మొదటగా భగత్ సింగ్ చిత్రపటానికి కళాశాల ప్రిన్సిపాల్ శాస్త్రి, కవి రచాయిత గంటేడ గౌరినాయుడు, ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయకార్యదర్శి అఖిల్, జిల్లా కమిటీ సభ్యులు పి. రాజశేఖర్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా గౌరినాయుడు మాట్లాడుతూ ఈనాటి హీరోలు మూడు గంటల పాటు డబ్బు కోసం తెరవెనుక తైతక్కలాడే జీరోలని, సమాజ చైత్ర ఉన్నంత వరకు చరిత్ర గమనం సాగుతున్నంత వరకు ఈ భూమి మీద పోరాటాలు జరుగుతున్నంత వరకు తమ జీవితాలను తృణప్రాణాల సైతం త్యాగం చేసిన నిజమైన హీరోలు భగత్ సింగ్, రాజుగురు సుఖదేవులని అన్నారు. ఈనాటి యువతరానికి జీరోలు కావాలో హీరోలు కావాలో తెలుసుకోవాలని పిలుపునిచ్చారు. చారిత్రకమైన ఈనాటి భారత దేశంలో దేశ స్వాతంత్ర ఉద్యమ నాయకులను గుర్తుపట్టలేకపోవడం చాలా బాధాకరమని, అటువంటి పరిస్థితులను నేటి పాలక ప్రభుత్వాలు చేపడుతున్నాయని మండిపడ్డారు. ఈ దేశ సంపదను దోచుకుపోతున్న బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని తరిమికొట్టాలని తన ప్రాణాలను లెక్కచేయకుండా పార్లమెంటు సాక్షిగా ఈ వానిని వినిపించుటకు ముందడుగు వేసి 23 సంవత్సరాలకే ప్రాణాలర్పించిన భగత్ సింగ్ జీవిత అంశాలను పాఠ్యాంశాల నుండి తొలగించి, మన జాతి పెద్ద మహాత్మా గాంధీజీని హత్య చేసినటువంటి మత ఉన్మాది, బ్రిటిష్ ప్రభుత్వానికి క్షమాభిక్ష మొరపెట్టుకున్న గాడ్సే వారసుల వీర సావర్కర్ జీవిత చరిత్రలను నేటి పాఠ్యాంశాలలో జోడిస్తుంటే మరలా బ్రిటిష్ ప్రభుత్వం తిరిగి వచ్చిందనే భావన కలుగుతుందని వాపోయారు. ఈ విధానాన్ని తీవ్రంగా ఖండించాల్సిన అవసరం మనందరి పైన ఉందని అన్నారు. భగత్ సింగ్ ఒక నాస్తికవాది అయినప్పటికీ దేశభక్తితో పరమాత్రాలను గౌరవించాడంలో గాని, సాటి మనుషులను ప్రేమించడంలో గాని నేటి తరంలో కూడా ఎవరు సాటి లేరని కానీ, ఉన్మాదపు దేశభక్తులు మతాల మధ్య కులాల మధ్య అనేక విభిన్న విచ్ఛిన్న శక్తులను జోడించి విధ్వంసాలకు పాల్పడుతున్నారని రాజ్యాంగాన్ని తునాతునకలం చేస్తున్నారని తెలిపారు. బ్రిటిష్ ప్రభుత్వాన్ని అంతమొందించాలనే భగత్ సింగ్ పిలుపు ప్రమాదకరమని భావించిన బ్రిటిష్ వాళ్ళు కోర్టు విధించిన శిక్షకు ఒకరోజు ముందునే చీకటి గదిలో ఉరిశిక్షకు పాల్పడ్డారని, ఆ క్షణంలో భగత్ సింగ్ చివరి కోరిక లెనిన్ రాసినటువంటి పుస్తక మిగులు భాగం పూర్తి చేయడమని, ఆఖరి డిమాండ్ బ్రతికున్న భగత్ సింగ్ కన్నా మరణించిన భగత్ సింగ్ చాలా ప్రమాదకరమని హితవు పలుకుతూ హెచ్చరించారు. నేటి ఉద్యమాలకు స్ఫూర్తిని రగిలించే భగత్ సింగ్ ముఖ చిత్రాన్ని కుయానా దేశభక్తులు అడ్డుపెట్టుకొని నాటి బ్రిటిష్ ప్రభుత్వాలు తెచ్చినటువంటి కార్పొరేట్ విధానాలను నేటి వారసులు అవలంబిస్తున్నారని అటువంటి ఉన్మాదపు కార్పొరేట్ శక్తులను తీవ్రంగా వ్యతిరేకించాలని కోరారు. కావున మరల భగత్ సింగ్ నేటి యువతరం నుండే పుట్టాలని కాసుల కోసం కక్కుర్తి పడే హీరోలుగా కాకుండా దేశం కోసం సమాజ అభివృద్ధి కోసం ఆదర్శంగా నిలబడే హీరోలుగా నిలవాలని విద్యార్థులను విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల సిబ్బంది మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

➡️