రెవెన్యూ అధికారులకు మిగతా ఆక్రమణలు కనబడవా?

Sep 30,2024 21:21

మక్కువ: మండలంలో రెవెన్యూ అధికారులకు మిగతా ఆక్రమణలు కనిపించకుండా ఒక్క తూరుమామిడిలోనే ఆక్రమణలు కనిపించాయా అంటూ ఎపి రైతు సంఘం జిల్లా అధ్యక్షులు ఎం.కృష్ణమూర్తి ప్రశ్నించారు. సోమవారం తూరుమామిడిలో పేదలు కట్టుకుంటున్న ఇళ్లను కృష్ణమూర్తి పరిశీలించారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ తూరుమామిడిలో ఇళ్ల స్థలాలకు కొనుగోలు చేసిన స్థలంలో సరిహద్దులు వేయకుండా పేదలకు పట్టాలిచ్చారని, ఆ ఇళ్ల స్థలాల్లో స్కూల్‌ కూడా నిర్మించడంతో పేదలు ఎవరికి నచ్చిన చోట వారు ఇళ్లు కట్టుకున్నారని అన్నారు. అందరిలాగే బొడ్డాన పైదమ్మ, గంగతో పాటు మరి కొంత మంది పేదలు గతంలో ఉన్న పూరిళ్ల స్థానంలో రేకు, స్లాబ్‌ ఇళ్లు కట్టుకుంటున్నామని తెలిపారు. స్థానిక సర్పంచ్‌ వారిపై రాజకీయ కక్షతో కూల్చి వేయడానికి ప్రయత్నిస్తున్నాడని, దీనికి రెవెన్యూ అధికారులు సహకరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అందరితో పాటు తామూ ఇళ్లు కట్టుకుంటే కాలనీలో ఉన్న అన్ని ఇళ్లు విచారణ చేయకుండా, కేవలం తమవే విచారించి నోటీసులు ఇవ్వడమేమిటని ప్రశ్నించారు. ఈ కాలనీలో పట్టాల్లేకుండా కొంత మంది వారికి నచ్చిన చోట స్థలం ఆక్రమించుకుంటే వారిని రెవెన్యూ అధికారులు ఏమీ అనడం లేదని మమ్మలనే ఇబ్బందులు పడుతున్నారు వాపోయారు.అనంతరం కృష్ణమూర్తి మాట్లాడుతూ ఒక్క తూరుమామిడిలోని ఆక్రమణలే రెవెన్యూ అధికారులు కనిపించాయా? మక్కువ మండలంలో ఇంకెక్కడా కనిపించలేదానని ప్రశ్నించారు. మక్కువ మెయిన్‌ రోడ్డుకు ఆనుకొని ఉన్న బైరి సాగరం చెరువును కప్పేసి కొంత మంది కోటీశ్వరులు దర్జాగా ఆక్రమించుకొని పెద్దపెద్ద భవనాలు కట్టి, షాపులు, హోటళ్లు నిర్మించి వ్యాపారాలు చేసుకుంటుంటే రెవెన్యూ అధికారులకు కనిపించలేదా అని ప్రశ్నించారు. అలాగే మెళాపువలస కాలనీలో వెంగళరావు సాగర్‌ ప్రాజెక్ట్‌ కాలువ గట్టుపై షాపులు, ఇళ్లు కట్టుకున్నారని, వెంగళరాయసాగర్‌ ప్రాజెక్ట్‌ దిగువన ప్రాజెక్ట్‌ భూమిలో ఏకంగా ఊరే కట్టేశారని, ఎ.వెంకంపేటలో బొబ్బిలి మెయిన్‌ రోడ్డుకు ఆనుకొని ఉన్న చెరువును పెత్తందార్లు ఆక్రమించుకున్నారని, ఇవేవీ అధికారులకు కనిపించలేదా అని అన్నారు. వీటిపై ఇప్పటికే ఫిర్యాదులు చేశామని, అవేవీ విచారణ చేయకుండా కేవలం తూరుమామిడిలో పేదల ఇళ్లు కూల్చడానికి నోటీసులివ్వడం అంటే సర్పంచ్‌తో లాలూచీ పెడుతున్నారని అర్ధమవుతుందని అన్నారు. ఇప్పటికైనా తూరుమామిడి పేదలకు ఇచ్చిన నోటీసులు వెనక్కు తీసకోవాలని డిమాండ్‌ చేశారు. రెవెన్యూ అధికారులు తూరుమామిడి సాల్వెల్యాండ్‌ మొత్తం సర్వే చేయాలని, పేదలందరికీ పట్టాలు మంజూరు చేయాలని డిమాండ్‌ చేశారు. మండలంలో అక్రమంగా ఆక్రమించిన బైరి సాగరం చెరువు ఆక్రమణలు తొలగించాలని, ఇతర చెరువులు, కాలువల్లో ఆక్రమణలు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కొల్లి గంగునాయుడు, పేదలు పాల్గొన్నారు.

➡️