సాలూరురూరల్: స్థానిక మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికుల సమ్మె బుధవారం మూడో రోజుకు చేరింది. పాలకవర్గం నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని మున్సిపల్ యూనియన్ తీవ్రంగా పరిగణిస్తుందని కమిటీ వెల్లడించింది. మూడవరోజు సమ్మె చేస్తున్న కార్మికులను ఉద్దేశించి మున్సిపల్ యూనియన్ మహిళా కమిటీ కో- కన్వీనర్ జి.స్వప్న, తుపాకుల సీత మాట్లాడారు. మున్సిపాలిటీలోని ప్రజలకు పారిశుధ్యం, నీరు, కరెంటు సమయానికి అందిస్తున్న కార్మికుల ఆకలి బాధలు తీర్చేందుకు పాలకవర్గానికి చొరవ లేకపోవడం కార్మికులపై పాలకులకు ఎంత ప్రేమ ఉందో ఈ విషయమే తెలియజేస్తుందని విమర్శించారు. పని చేయించుకున్నప్పుడు చేసే వారికి జీతం ఇవ్వాల్సిన బాధ్యత యజమానికి ఉంటుందని, కనీసం మున్సిపల్ కార్మికులకు జీతాలు ప్రతినెలా ఇవ్వాలన్న ఆలోచన కూడా సాలూరు పాలకవర్గానికి గానీ, అధికారులకు గానీ, ప్రజా ప్రతినిధులకు గాని లేకపోవడం దురదృష్టకరమని తెలిపారు. కార్మిక సమస్యలు పరిష్కరించడంలో ఇదే వైఖరి కొనసాగితే సమ్మెను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో మున్సిపల్ యూనియన్ సాలూరు కమిటీ అధ్యక్షులు టి .శంకర్రావు నాయకులు పోలరాజు, రవి, వెంకన్న ,హరి కార్మికులు పాల్గొన్నారు.
