ప్రజాశక్తి-పార్వతీపురం: ప్రజలకు సేవలందించడంలో, ఆరోగ్యాలను కాపాడడంలో పారిశుధ్య కార్మికులు అందిస్తున్న సేవలు అమోఘమని జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ తెలిపారు. స్వచ్ఛతా హి సేవ కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛ భారత్ దివస్ సందర్బంగా బుధవారం కలెక్టరు కార్యాలయ సమావేశ మందిరంలో గ్రామ పంచాయతీ శాఖ ఏర్పాటుచేసిన కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ముందుగా గాంధీ చిత్రపటానికి పూలమాల వేశారు. స్వచ్ఛతా హి సేవ కార్యక్రమంలో చక్కని పనితీరు కనబరిచిన పంచాయతీలకు, గ్రీన్ అంబాసిడర్లను అభినందిస్తూ సన్మానాలు చేసి, ధ్రువపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ స్వచ్ఛత హి సేవ కార్యక్రమం అమల్లో రాష్ట్రంలో మన్యం జిల్లా నాలుగో స్థానం పొందిందన్నారు. ప్రజలు ఇంటి నుండి అందించే చెత్తను తడి,పొడి చెత్తగా విడదీసి ఇవ్వాలని సూచించారు. తడి చెత్తతో వర్మికంపోస్టు తయారీకి, పొడి చెత్తను తిరిగి వినియోగించుకొనే వస్తువులు తయారీకి ఉపయోగిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ, డ్వామా పీడీ కె.రామచంద్ర రావు, డిఆర్‌ఒ జి.కేశవనాయుడు, జిల్లా ఆర్‌డబ్ల్యుఎస్ ఇంజినీరింగ్ అధికారి ఒ.ప్రభాకరరావు, తదితరులు పాల్గొన్నారు.గాంధీ సిద్ధాంతాలను ఆచరిస్తున్న ‘జట్టు’పార్వతీపురం టౌన్ : పరిసరాలు శుభ్రంగా ఉంటే మన ఆలోచనలు కూడా మంచిగా ఉంటాయనే గాంధీ సిద్ధాంతాలను జట్టు ఫౌండేషన్ ఆచరణలో చూపిస్తోందని కలెక్టర్ శ్యామ్‌ప్రసాద్ తెలిపారు. బుధవారం పట్టణ శివారులో ఉన్న జట్టు ఆశ్రమంలో నిర్వహించిన స్వచ్ఛత హి సేవా కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న కార్యక్రమాన్ని నూరు శాతం జట్టు ఫౌండేషను అమలు చేస్తుందన్నారు. కార్యక్రమంలో జట్టు ఆశ్రమ వ్యవస్థాపకులు వి.పద్మజమ్మ, నాబార్డు డిడిఎం దిలీప్, డి.పారినాయుడు, సిహెచ్ పారునాయుడు, ఎ.కైలాసరావు, ఎ.ఈశ్వరరావు, ఎన్.హేమంత్, పవన్, యశ్వంత్, హరి పాల్గొన్నారు.