ప్రజాశక్తి – పార్వతీపురం రూరల్ : మున్సిపల్ టీచర్ల దశల వారీ పోరాటాన్ని జయప్రదం చేయాలని యుటిఎఫ్ జిల్లా ఆఫీస్ బేరర్ల సమావేశంలో నాయకులు పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో జరిగిన సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర కార్యదర్శి ఎస్.మురళీమోహనరావు మాట్లాడుతూ మున్సిపల్ టీచర్లకు, పిఎఫ్ సౌకర్యం కల్పించాలని, పోస్టులన్నింటినీ అప్ గ్రేడ్ చేసి ప్రమోషన్లు బదిలీలు చేపట్టాలని పిలుపునిచ్చారు. అర్బన్ ఎంఇఒ పోస్టులను మంజూరు చేయాలని, మున్సిపల్ హై స్కూళ్లకు నాన్ టీచింగ్ స్టాఫ్‌ను కేటాయించాలని డిమాండ్ చేస్తూ దశలవారీ పోరాటాన్ని సాగిస్తున్నామని తెలిపారు. అక్టోబర్ 2న సత్యాగ్రహ దీక్ష, 17న డిఇఒ కార్యాలయం వద్ద, 24న డైరెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేయడానికి కార్యాచరణ ప్రకటించడమైందని, అన్ని దశల్లో జరిగే కార్యక్రమాల్లో ఉపాధ్యాయులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా గౌరవ అధ్యక్షులు ఎ.భాస్కరరావు, సహాధ్యక్షులు వి.జ్యోతి, జిల్లా కోశాధికారి కె.మురళి, ఆఫీస్ బేరర్లు పాల్గొన్నారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2024/09/utf-3.jpg)