ప్రజాశక్తి – సాలూరు : పట్టణ సమీపంలో జైపూర్ రోడ్డులో గల కెవిఆర్ అపార్ట్మెంట్ పరిసరాల్లో అపారిశుధ్యం తాండవిస్తోంది. గత కొంతకాలంగా ఆ అపార్ట్మెంట్ వాసులు వారి ఇళ్ల నుంచి వచ్చిన చెత్తాచెదారాలను రోడ్డు పక్కన వేస్తున్నారు. దీంతో ఇరుగుపొరుగునున్న ఇండిపెండెంట్ ఇళ్లవాసులకు తీవ్రదుర్గంధం వెదజల్లుతోంది. పట్టణ పారిశుధ్య విభాగం సిబ్బంది ఈ చెత్తాచెదారాలను తరలించడం లేదు. దీంతో రోజుల తరబడి పేరుకుపోయిన చెత్తతో దోమల ఉత్పత్తి కూడా పెరుగుతోంది. దీనిపై సమీపంలో ఉన్న ఇండిపెండెంట్ ఇళ్ల వాసులు మున్సిపల్ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా స్పందించడం లేదు. మున్సిపల్ అధికారులు అసలు స్పందించకపోవడానికి కారణాలు కూడా ఉన్నాయి. కెవిఆర్ అపార్ట్మెంట్‌లో గల 93 ప్లాట్లకు సంబంధించిన పనులు గత కొంతకాలంగా మున్సిపాలిటీకి చెల్లించడం లేదని తెలుస్తోంది. ఈ అపార్ట్మెంట్‌లో కొంతమంది ప్లాట్లను కొనుగోలు చేసుకుని నివాసం వుంటున్నారు. ఇంకొంతమంది ప్లాట్లలో అద్దెకు నివసిస్తున్నారు. అమ్మకమైన ప్లాట్లకు సంబంధించి ఇంటి పన్నులను మున్సిపాలిటీకి నివాసితులు చెల్లించాల్సి ఉంటుంది. కానీ ఆ విధంగా వారు చెల్లించకపోవడంతో చెత్తను పారిశుధ్య కార్మికులు తరలించడం లేదు. ఎందుకంటే వారు పన్నులు చెల్లించనందున చెత్తచెదారాలను తరలించడం లేదని మున్సిపల్ అధికారులు చెబుతున్నారు. ఇంతకీ అపార్ట్మెంట్ వాసులు పన్ను చెల్లించకపోవడానికి అసలు కారణం కెవిఆర్ ఎస్టేట్ యజమాని వైఖరేనని తెలుస్తోంది. ఆయన బిల్డర్‌గా నిర్మించిన అపార్ట్మెంట్‌లో కొనుగోలు చేసిన ప్లాట్లకు బాండ్ పత్రాలను హక్కు దారులకు అందజేయాలి. ఆ పత్రాలను మున్సిపల్ రెవెన్యూ అధికారులకు సమర్పించిన తర్వాత పన్నులు చెల్లించే అవకాశం ఉంటుంది. కెవిఆర్ ఎస్టేట్ యజమాని ఉద్దేశపూర్వకంగానే మున్సిపాలిటీకి పన్నులు ఎగ్గొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో ఆ అపార్ట్మెంట్ వాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనిపై మున్సిపల్ కమిషనర్ సత్యనారాయణ వివరణ కోరగా అపార్ట్మెంట్ వాసులు పన్ను చెల్లించడం లేదని, అందుకే అపార్ట్మెంట్ ఇళ్ల నుంచి వచ్చిన చెత్తాచెదారాలను తరలించడం లేదని చెప్పారు. అయితే ఈ అపార్ట్‌మెంట్ వాసులు రోడ్డు పక్కన చెత్తలు వేయడం సరికాదని చెప్పారు. ప్లాట్ల విక్రయించిన కెవిఆర్ ఎస్టేట్ యజమాని వాటికి సంబంధించిన పత్రాలను హక్కుదారులకు అందజేయకుండా తాత్సారం చేస్తున్నారని చెప్పారు.
