ప్రజాశక్తి – పార్వతీపురం: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ కార్మిక, రైతు, వ్యవసాయ కార్మిక, గిరిజన సంఘాల సమన్వయ కమిటీ ఆధ్వర్యాన పట్టణంలో మంగళవారం భారీ ర్యాలీ నిర్వహించారు.ఆయా సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యాన స్థానిక పాత బస్టాండ్ నుంచి కలెక్టర్ కార్యాలయం వరకూ ర్యాలీ నిర్వహించి, అనంతరం ధర్నా చేశారు. జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్ బంటు దాసు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కిసాన్ మోర్చా రాష్ట్ర నాయకులు పి.ఝాన్సీ, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి వై.మన్మధరావు మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి సంకీర్ణ ప్రభుత్వం వచ్చినా గతంలో అనుసరించిన కార్పొరేట్ అనుకూల విధానాలనే అమలు చేస్తోందని అన్నారు. వ్యవసాయ నల్ల చట్టాలను రద్దు చేసిన సందర్భంలో సంయుక్త కిసాన్ మోర్చా నాయకత్వానికి రాతపూర్వకంగా ఇచ్చిన హామీలకు భిన్నంగా కార్పొరేట్ అనుకూల విధానాల అమలుకు బిజెపి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని చెప్పారు. బడ్జెట్ సందర్భంగా డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ (డిఎఎం) పథకాన్ని ప్రకటించిందని, దీనివల్ల 2026 నాటికి 11 కోట్ల మంది రైతులను కార్పొరేట్ కంపెనీలకు అనుసంధానం చేస్తానని ప్రకటించిందని చెప్పారు. ఈ ఏడాది ధాన్యం గోదాముల కొనుగోళ్లు నిలిపివేసిందని చెప్పారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరలు 2 నుండి 7 శాతం మాత్రమే పెంచిందని చెప్పారు. ఈ స్థితిలో పంటల కొనుగోళ్ల నుంచి తప్పుకుని రైతాంగాన్ని మార్కెట్ శక్తుల దయాదాక్షిణ్యాలకు వదలివేస్తుందని చెప్పారు. ఎరువులపై నియంత్రణ తొలగించడంతో వాటి ధరలు రైతులకు అందుబాటులో లేకుండా పెరిగిపోతున్నాయని చెప్పారు. వ్యవసాయ ఉపకరణాలపై జిఎస్‌టి భారంగా మారిందని అన్నారు. ఏజెన్సీ ప్రాంతంలో గిరిజన యూనివర్సిటీ నిర్మించాలని కోరారు. అక్రమ భూ సేకరణ నిలుపు చేయాలనీ, 2013 భూ సేకరణ చట్టం, ఫారెస్ట్ రైట్ యాక్ట్ 1/70 అమలుపరచాలని కోరారు. కార్యక్రమంలో కార్మిక, రైతు సంఘాల నాయకులు జి.వెంకటరమణ, రెడ్డివేణు, వి.ఇందిర, శ్రీనునాయుడు, సూరిబాబు, బుడితి అప్పల నాయుడు, జీవ, రంజిత్‌కుమార్, సూరయ్య, కుమార్, రాజు, గంగు నాయుడు, సత్యనారాయణ, పాల ఈశ్వరరావు, దుర్గారావు, సంగం, లక్ష్మునాయుడు, ఈశ్వరరావు, కిసాన్ మోర్చా సమన్వయ కమిటీ సభ్యులు మాట్లాడారు.సాలూరు రూరల్ : కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిలిపివేయాలని, మున్సిపల్ కార్మికుల ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మంగళవారం స్థానిక రాజేశ్వరరావు పార్కు నుండి మెయిన్ రోడ్డు మీదుగా మంత్రి సంధ్యారాణి ఇంటి వరకు కార్మికులు నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మికులను ఉద్దేశించి సిఐటియు జిల్లా కార్యదర్శి ఎన్ వై నాయుడు మాట్లాడుతూ స్థానిక మున్సిపల్ మున్సిపల్ పరిధిలో పనిచేసే కార్మికులందరికీ బకాయి జీతాలు అందేలా పాలకవర్గంతో చర్చించాలని, రానున్న సాలూరు గ్రామ దేవత పండగను దృష్టిలో పెట్టుకొని కార్మికుల సంఖ్య పెంచాలని కోరారు. అనంతరం మంత్రి సంధ్యారాణికి వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి సంధ్యారాణి కార్మికులను ఉద్ధేశించి మాట్లాడుతూ మున్సిపల్ పరిధిలో గల సమస్యలు పరిష్కారమయ్యేలా అధికారులతో చర్చిస్తానని, మిగిలిన సమస్యలను ప్రభుత్వానికి నివేదిస్తానని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ నాయకులు ఉమా, వాటర్ వర్కర్స్ యూనియన్ నాయకులు డిరు సంతోష్,పారిశుద్ధ్య విభాగ కార్మిక సంఘం నాయకులు టీ శంకర్రావు ,రవి, స్వప్న కార్మికులు పాల్గొన్నారు.