మూన్నాళ్ల ముచ్చటే

Feb 4,2025 21:26

ప్రజాశక్తి – సీతంపేట : మండలంలోని కుసిమి జంక్షన్‌ నుంచి శంభాం వరకు రూ.20 లక్షలతో ఆర్‌ అండ్‌ బి అధికారులు చేపట్టిన రోడ్డు మరమ్మతు పనులు కనీసం మూడేళ్ల ముచ్చటైనా తీరలేదు. ఆర్‌అండ్‌బి ఇంజినీరింగ్‌ అధికారుల పర్యవేక్షణ కొరవడంతో కాంట్రాక్టురు చేతివాటం ప్రదర్శించడంతో పనులు పూర్తి మూడు వారాలైనా కాకలేదు ఇప్పటికే రోడ్డంతా ఎక్కడికక్కడ రాళ్లు తేలిపోతున్నాయి. కుసిమి జంక్షన్‌ నుంచి శంభాం వరకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఇండియన్‌ బ్యాంక్‌, మూడు ఆశ్రమ ఉన్నత పాఠశాలలు, ఒక గురుకుల పాఠశాల, ప్రతిభా కళాశాల, ప్రాథమిక పాఠశాలలతో పాటు సుమారు 200 గ్రామాల పర్యాటకుల సందర్శించే ఆడలి వ్యూ పాయింట్‌కు ఈ రహదారిపైనే వెళ్లాలి. నిత్యం రాకపోకలతో రద్దీగా ఉన్న ఈ రహదారి నాణ్యతకు పాతరేసిననట్లుగా మరమ్మతులు చేపడితే ఎలా అని గిరిజనులు, ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రహదారుల మరమ్మతులు చేపట్టి మూడు వారాలు గడవకముందే అప్పుడే పెచ్చులు ఊడిపోవడంతో దారుణమంటున్నారు. ఇక వర్షాకాలంలో పరిస్థితి మరింత దారుణంగా తయారవుతుందని పెదవులు విరిస్తున్నారు. గతంలో ఈ రోడ్డు మరమ్మతులు చేపట్టాలని గిరిజనులు స్థానిక ప్రజాప్రతినిధులకు, అధికారులకు వినతులు అందజేశారు. అయితే మంత్రంగా మట్టిని గోకిసి దీనిపై తారు వేసుకొని తూతూ మంత్రంగా పనులు చేపడుతున్నారు. అంతేకాకుండా తారు చిప్స్‌ మిషన్‌తో వేయకుండా మనుషులే వేశారని, దీనిపై బుల్డోజర్‌తో రోలింగ్‌ చేశారని చుట్టుపక్కల గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. మళ్లీ గ్రామస్తులు ఒక లేయరే వేశారని గ్రామస్తులు సూపర్వైజర్‌కు అడగ్గా మరొక లేయర్‌ వేస్తామని చెప్పి మూడు వారాలు గడుస్తున్నా ఇంతవరకూ రెండో లేయర్‌ వేయలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రహదారి కూడా ఎత్తుపల్లాలు లెవిలింగ్‌ చేయకుండా రహదారి మరమ్మతులు చేపట్టారని ఆవేదన వ్యక్తం చేశారు.

➡️