పథకాల అమల్లో పారదర్శకత

Apr 23,2025 22:27

ప్రజాశక్తి-సాలూరు రూరల్‌: పథకాల అమల్లో అధికార యంత్రాంగం పారదర్శకతతోపాటు వేగాన్ని పాటించాలని గిరిజన సంక్షేమ శాఖా మంత్రి సంధ్యారాణి తెలిపారు. బుధవారం సాలూరు మండల పరిషత్తు సమావేశ మందిరంలో అన్ని విభాగాల అధికారులు, సిబ్బందితో సమావేశం ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తోందన్నారు. పల్లె ప్రగతి, హరిత హారం, పండుగలకు సంబంధించి సముదాయ శుభ్రత, నీటి సరఫరా, నూతన పింఛన్ల పంపిణీ, గృహ నిర్మాణాల పురోగతి, విద్యుత్‌ సరఫరా, పాఠశాలల ఆధునీకరణ వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులు, వారి అవసరాలు అధికారుల దృష్టికి వచ్చాక వెంటనే స్పందించేలా ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటవ్వాలన్నారు. ప్రజాప్రతినిధులతో అధికారులు సమన్వయంతో పనిచేయాలని, వారి సూచనలు, అవసరాలను పరిగణనలోకి తీసుకొని అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. మండలంలోని కొన్ని గ్రామాలలో అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులను ప్రశ్నించారు. ఆయా అభివృద్ధి కార్యక్రమాలు జరిగే విధానంలో ఎటువంటి లోపాలు లేకుండా చూడాలని, పర్యవేక్షణలో వాస్తవ పరిస్థితులపై అధికారులు సమగ్రమైన నివేదికలు అందజేయాలని తెలిపారు. ఈ సమావేశంలో ఎంపిడిఒ గొల్లపల్లి పార్వతి, తహశీల్దార్‌ ఎన్‌వి రమణ, మండల అధికారులు, ఉద్యోగులు, సచివాలయ సిబ్బంది, టిడిపి మండల అధ్యక్షులు ఆముదాల పరమేష్‌ పాల్గొన్నారు.జీడిపిక్కల కొనుగోలు ప్రారంభంమండంలోని బాగువలస వద్ద జీడిపిక్కల కొనుగోలు కేంద్రాన్ని బుధవారం మంత్రి సంధ్యారాణి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మండలంలో వన్‌ధన్‌ వికాస్‌ కేంద్రాల ద్వారా మూడు చోట్ల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేస్తున్నట్లు తెలిపారు. నాణ్యమైన జీడిపిక్కలను రైతులు కొనుగోలు కేంద్రాలకు తెచ్చి మార్కెట్‌ ధరకు అనుగుణంగా మంచి మద్దతు ధరను పొందాలని కోరారు. కేంద్రంలో అందజేసిన వెంటనే మద్దతు ధరను రైతు ఖాతాలలో జమ చేయనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో డిఆర్‌డిఎ పీడీ డి.సుధారాణి, ఎంపిడిఒ గొల్లపల్లి పార్వతి, తహశీల్దార్‌ ఎన్‌వి రమణ, ఏరియా కోఆర్డినేటర్‌ బి.శివుని నాయుడు, ఎపిఎం జయమ్మ, టిడిపి మండల అధ్యక్షులు ఆముదాల పరమేష్‌, సిసిలు, విఒఎలు పాల్గొన్నారు.కిలో జీడిపిక్కలను రూ.200కు కొనాలి కొమరాడ : విడివికె ద్వారా ఏర్పాటుచేసిన జీడిపిక్కల కొనుగోలు కేంద్రంలో కిలో రూ.200కు కొనాలని సిపిఎం నాయకులు కె.సాంబమూర్తి డిమాండ్‌చేశారు. బుధవారం కొమరాడలో ఆయనతోపాటు ఆదివాసీ గిరిజన సంఘం నాయకులు కైలాస్‌, రామారావు మాట్లాడారు. సిపిఎం, గిరిజన సంఘం పోరాట ఫలితంగా చోల్లపదంలో కొనుగోలు కేంద్రం ఏర్పాటుచేశారని చెప్పారు. కానీ కిలో జీడిపిక్కలు రూ.155కి కొనుగోలు చేస్తామని ప్రకటించారని, దీనివల్ల గిరిజనులు నష్టపోతారని తెలిపారు. వెంటనే గ్రామాల్లోకి వెళ్లి గిరిజన రైతుల వద్ద ఉన్న జీడిపిక్కలు వెంటనే కిలో 200 రూపాయలకు కొనుగోలు చేయాలని కోరారు.

➡️