పాచిపెంట: రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల అమల్లో అధికార యంత్రాంగం పారదర్శకతతో పాటు వేగాన్ని పాటించాలని రాష్ట్ర గిరిజన సంక్షేమ, స్త్రీ, శిశు సంక్షేమశాఖా మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. మండలంలో అమలవుతున్న వివిధ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల పురోగతిని సమీక్షించేందుకు మండల స్థాయి అధికారులతో గురువారం స్థానిక మండలపరిషత్ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉందని, కావున అధికారులు ప్రతిష్టాత్మక పథకాల అమలులో పారదర్శకత, వేగం పాటించాలని సూచించారు. ముఖ్యంగా పల్లె ప్రగతి, హరిత హారం, సముదాయ శుభ్రత, నీటి సరఫరా, పింఛన్ల పంపిణీ, గృహ నిర్మాణాలు, విద్యుత్ సరఫరా, పాఠశాలల ఆధునీకరణ వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. అదేవిధంగా ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులు, అవసరాలను అధికారులు సమర్థవంతంగా పరిష్కరించేలా వ్యవస్థను రూపొందించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ప్రజాప్రతినిధుల సూచనల మేరకు అభివృద్ధి కార్యక్రమాలు అమల్లోకి రావాలని పేర్కొన్నారు. అభివృద్ధి పనుల నాణ్యతపై మంత్రి అధికారులను ప్రశ్నించడంతో పాటు పర్యవేక్షణ పెంచాలని, వాస్తవ నివేదికలు సమర్పించాలని ఆదేశించారు. అనంతరం మండలంలో చేపట్టిన ప్రాధాన్యతా ప్రాజెక్టులపై సమయపాలనతో కూడిన కార్యాచరణ రూపొందించాలని పేర్కొన్నారు. ప్రతి గ్రామం అభివృద్ధి పరంగా ముందుకు సాగాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలిపారు. సమావేశంలో ఎంపిడిఒ బివిజె పాత్రో, తహశీల్దార్ డి .రవి పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. పార్టీ బలోపేతానికి సమిష్టి కార్యచరణమండలంలో తెలుగుదేశం పార్టీ బలోపేతానికి సమిష్టి కార్యచరణ ద్వారా ప్రతి కార్యకర్త, నాయకుడు కృషి చేయాలని మంత్రి సంధ్యారాణి కోరారు. మండలంలోని మిర్తివలస సమీపాన టిడిపి మండల స్థాయి నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామస్థాయిలో పార్టీ బలోపేతం, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుపై సమీక్షించడంతో పాటు ప్రజల సమస్యలపై స్పందనతో ముందుకు సాగాలని మంత్రి తెలిపారు. అలాగే మైదాన, ఏజెన్సీ ప్రాంతాల్లో గల ప్రతి ఊరికి తాగునీరు, రోడ్డు సదుపాయం కచ్చితంగా మన ప్రభుత్వం కల్పిస్తుందని హామీ ఇచ్చారు. స్థానిక ఎన్నికల్లో వందకి వందశాతం సీట్లు గెలవాలని నాయకులకు, కార్యకర్తలకు మంత్రి పిలుపునిచ్చారు. అలాగే గ్రామస్థాయిలో ఉండే ప్రజా ప్రతినిధులు, నాయకులు ప్రజల అవసరాలను గుర్తించి వారికి ప్రభుత్వం ద్వారా సంక్షేమ పథకాలు అందేలా చూడాలన్నారు. టిడిపిని రాష్ట్రంలో బలమైన రాజకీయ శక్తిగా ఏర్పాటు చేసుకోవాలన్నారు. ప్రతి నాయకుడు, కార్యకర్త బాధ్యతతో పనిచేసే ప్రజల సమస్యలను తన దృష్టికి తీసుకొస్తే తక్షణమే పరిష్కరించి చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు. రెడ్ బుక్ అనగానే వైసీపీ నాయకులకు హార్ట్ ఎటాక్ లు వస్తున్నాయని, కొంతమంది నాయకులు గ్రామాలు, రాష్ట్రాలు విడిచిపెట్టి వెళ్లిపోతున్నారని, ఎందుకంటే తప్పులు చేసిన వారికి శిక్షలు తప్పవని, చట్టం తన పని తాను చేసుకుపోతుందని గుర్తు చేశారు. నియోజవర్గంలో సమస్యలన్నీ పరిష్కరిస్తానన్నారు. కార్యక్రమంలో ఎఎంసి చైర్మన్ ముఖీ సూర్యనారాయణ, సర్పంచి గూడెపు యుగంధర్, నాయకులు పిన్నింటి ఈశ్వరరావు, కొత్తల పోలినాయుడు, మతల బలరాం, పల్లెడ ఉమామహేశ్వరరావు, పూసర్ల నర్సింగరావు, చల్లా కనక, కె.సురేష్, కార్యకర్తలు పాల్గొన్నారు.
