పట్టణాభివృద్ధి పాలకులకు పట్టదా?

Jan 8,2025 21:39

ప్రజాశక్తి-సాలూరురూరల్‌ : సాలూరు పట్టణాభివృద్ధి పాలకులకు పట్టడం లేదా? అని పట్టణ పౌర సంక్షేమ సంఘం నాయకులు ఎన్‌.వై.నాయుడు నిలదీశారు. బుధవారం స్థానిక సిపిఎం కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. దశాబ్దాల క్రితం ఏర్పడిన సాలూరు మున్సిపాలిటీ అభివృద్ధికి నోచుకోవడం లేదన్నారు. పాలకులు మారుతున్నా, ప్రయోజనం ఏమీ లేదని చెప్పారు. గతంలో పాలకవర్గాన్ని వైసిపి నాయకుల చేతిలో పెడితే వారు కనీసం పట్టించుకోలేదన్నారు. దీంతో గత సాధారణ ఎన్నికల్లో టిడిపి అభ్యర్థిని భారీ మెజార్టీతో పట్టణ ప్రజలు గెలిపించారని, కానీ నేటికీ కనీస మౌలిక వసతులు కల్పించడానికి ముందుకు రావడం లేదని, ఇది పట్టణ ప్రజల దౌర్భాగ్యమని ఆవేదన వ్యక్తంచేశారు. పట్టణ అభివృద్ధి విషయంలో మున్సిపల్‌ పాలకవర్గం, అధికార పార్టీ నాయకత్వం చిత్తశుద్ధితో పనిచేయకపోవడం వల్ల సమస్యలు రోజురోజుకు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. 2014లో అప్పటి టిడిపి ప్రభుత్వ హయాంలో రూ.లక్షలు వెచ్చించి నిర్మించిన రైతు బజారును నేటికీ ప్రారంభించక పోవడం పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనం కాదా? అని ప్రశ్నించారు. ప్రజాధనంతో నిర్మించిన టిడ్కో ఇళ్లు లబ్ధిదారులకు ఇవ్వడం లేదన్నారు. జగనన్న కాలనీలో స్థలాలు ఖాళీగా ఉన్నాయని, కట్టుకున్న వారికి కూడా పూర్తిస్థాయిలో సౌకర్యాలు కల్పించలేదని చెప్పారు. పట్టణంలో అనేక వార్డుల్లో రోడ్లు లేవని తెలిపారు. పట్టణంలో ప్రభుత్వ లైబ్రరీ, ప్రభుత్వ ఐటిఐలు ఏళ్ల తరబడి అద్దె భవనాల్లో ఉన్నాయని గుర్తుచేశారు. పై సమస్యలు పరిష్కారం కోసం వెంటనే మున్సిపల్‌ పాలకవర్గం, మంత్రి కృషి చేయాలని, లేకుంటే ప్రజలను కలుపుకొని ఆందోళనకు సిద్ధమవుతామని హెచ్చరించారు. సమావేశంలో పట్టణ పౌర సంక్షేమ సంఘం నాయకులు ఈశ్వరరావు, ప్రసాద్‌, రవి, కళ్యాణ్‌ పాల్గొన్నారు.

➡️