పర్యాటక స్థలంగా విజయనగరం కోట

Sep 30,2024 21:40

ప్రజాశక్తి-విజయనగరంకోట : నగరానికి చారిత్రక వారసత్వ సంపదగా వున్న కోటను సుందరీకరణ చేసి ఒక మంచి పర్యాటక స్థలంగా తీర్చిదిద్దనున్నట్టు జిల్లా కలెక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌ వెల్లడించారు. విజయనగర ఉత్సవాలలోపే సుందరీకరణ పనులు పూర్తిచేసి సిద్ధంచేయాలని అధికారులను ఆదేశించారు. స్థానిక ఎమ్మెల్యే అదితి గజపతిరాజుతో కలసి కలెక్టర్‌ సోమవారం కోట వెలుపలి ప్రాంతాన్ని సందర్శించారు. కోట గోడ చుట్టూ సుందరీకరణకు చేయాల్సిన ఏర్పాట్లపై ఎమ్మెల్యే, అధికారులతో చర్చించారు. సుందరీకరణ పనులను అక్టోబరు 10వ తేదీ నాటికి పూర్తిచేసి ఉత్సవాల్లో సందర్శకులకోసం సిద్ధం చేయాలన్నారు. పనులు మంగళవారం నుంచే ప్రారంభం కావాలని స్పష్టంచేశారు. ఆర్‌డిఒ ప్రతిరోజూ పనులను పర్యవేక్షించాలన్నారు. కోట గోడపై అన్నివైపులా లైటింగ్‌ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ సూచించారు. కోట చుట్టూ వున్న కందకాలను నీటితో నింపి లాన్‌ తో అందంగా తీర్చిదిద్దాలన్నారు. కోట గోడను ఆనుకొని వెనకవైపు వున్న ఖాళీ స్థలంలో సందర్శకులు కూర్చొనేందుకు వీలుగా సీటింగ్‌ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. కోటకు దక్షిణ వైపున ప్రతిరోజూ లైట్‌ అండ్‌ షో నిర్వహించి విజయనగరం చరిత్ర, వైభవాన్ని సాయంత్రం వేళల్లో లేజర్‌ షో ద్వారా ప్రదర్శించేందుకు శాశ్వత ఏర్పాట్లు చేయాలని సూచించారు. దక్షిణంవైపు కోట సుందరీకరణలో భాగంగా ఆ ప్రాంతంలో నివాసం వుంటున్న 16 కుటుంబాలకు పునరావాసం కల్పించాలని తహశీల్దార్‌ను కలెక్టర్‌ ఆదేశించారు. సోనియానగర్‌ లో వున్న టిడ్కో ఇళ్లను వారికి కేటాయించాలని సూచించారు. వారంలోగా వారంతా అక్కడికి తరలివెళ్లేలా ఏర్పాట్లు చేయాలన్నారు. పర్యటనలో ఆర్‌డిఒ దాట్ల కీర్తి, సిపిఒ పి.బాలాజీ, డిఆర్‌డిఎ పీడీ కళ్యాణ చక్రవర్తి, మాన్సాస్‌ ఇఒ కె.ఎన్‌.వి.డి.వి.ప్రసాద్‌, తహశీల్దార్‌ కూర్మనాధరావు, పూసపాటి రాజేష్‌ తదితరులు పాల్గొన్నారు.ఉత్సవాలకు 12 వేదికలు సిద్ధం అక్టోబర్‌ 13, 14 తేదీలలో నిర్వహించనున్న విజయనగరం ఉత్సవాలను నగరం లోని 12 ప్రధాన వేదికల వద్ద పలు వినోద కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ బిఆర్‌.అంబేద్కర్‌ తెలిపారు. 12 వేదికల వద్ద జిల్లా అధికారులను ఇంచార్జ్‌ లుగా నియమించి , కార్యక్రమాల పట్ల వారి ఆశక్తికి తగ్గట్టుగా సుమారు 50 మంది లైఫ్‌ మెంబెర్లను ప్రతి వేదిక వద్ద సర్దుబాటు చేసినట్లు తెలిపారు. లైఫ్‌ మెంబర్ల సలహాలు సూచనలతో అధికారులు కార్యక్రమాలు నిర్వ హించాలని తెలిపారు. ఉత్సవాల నిర్వహణలో అందరినీ భాగస్వాములను చేయాలని సూచించారు.

➡️