ప్రజాశక్తి – పార్వతీపురం : మండలంలోని రావికోన పంచాయతీ విఒఎ కన్యాకుమారిని కొనసాగించాలని, సంఘం సభ్యుల సంతకాలు ఫోర్జరీ చేసిన సిసిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మంగళవారం డ్వాక్రా మహిళలు స్థానిక డిఆర్‌డిఎ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ శ్యాం ప్రసాద్, పిడి సత్యం నాయుడుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ కడ్రక రామస్వామి, శ్రామిక మహిళా సంఘం నాయకురాలు వి.ఇందిరా మాట్లాడుతూ రావికోన పంచాయతీలో పనిచేస్తున్న విఒఎను మానసికంగా, రాజకీయంగా ఇబ్బంది పెడుతున్నారని చెప్పారు. గ్రూపు సభ్యుల సంతకాలు సీసీ ఫోర్జరీ చేసి ఎపిఎం రాజకీయ నాయకులు చెప్పినట్టు విఒఎలను మానసికంగా వేధిస్తున్నారని ఫిర్యాదు చేశారు. గ్రామ సభలు జరపకుండా గ్రామైక్య సంఘాల సంతకాలు లేకుండా తీర్మానం ఎలా చేశారని ప్రశ్నించారు. సర్పంచికి తెలియకుండా ఇలా చేయడం మంచి పద్ధతి కాదన్నారు. ఇప్పటికైనా విఒఎ కన్యాకుమారిని కొనసాగించాలని కలెక్టర్, వెలుగు పీడీకు వినతి పత్రాలు అందించారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి రెడ్డి వేణు, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి యమ్మల మన్మధరావు, ఐద్వా నాయకులు రెడ్డి శ్రీదేవి, అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. కొమరాడ : మండలంలో అక్రమంగా తొలగించిన దళాయిపేట విఒఎను వెంటనే విధులోకి తీసుకోవాలని సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు కొల్లి సాంబమూర్తి డిమాండ్ చేశారు. తొలగించిన విఒఎను విధులకు తీసుకోవాలని కోరుతూ స్థానిక వెలుగు కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ముంజి స్వర్ణకుమారిని కక్ష సాధింపు చర్యల్లో తొలగించడం అన్యాయమని కాబట్టి వెంటనే ఆమెను విధుల్లోకి తీసుకోవాలని ఎపిఎం రమణను కోరారు. దీనికి ఎపిఒ స్పందిస్తూ 12 మహిళా సంఘాల సభ్యులు తీర్మానం ప్రకారం స్వర్ణ కుమారిని తొలగించి శెట్టి కళ్యాణిని నియమించినట్టు తెలిపారు. దీనికి సిఐటియు, మహిళా సంఘం నాయకులు మాట్లాడుతూ సుమారు 48 గ్రూపులుండగా కేవలం 12 గ్రూపులు తీర్మానం ప్రకారం ఎలా స్వర్ణకుమారిని తొలగిస్తారని ప్రశ్నించారు. ఇలాంటి సందర్బంలో కక్ష సాధింపు చర్యలు మానుకోవాలన్నారు. తక్షణమే గ్రూపులందరితో సమావేశం ఏర్పాటు చేసి పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపట్టి విఎఒ స్వర్ణ కుమారికి న్యాయం చేయాలని, లేకుంటే ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తామని తెలిపారు. అంతేకాక ఈ విషయమై కలెక్టర్‌కు కూడా ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు.