కురుపాం : గత ప్రభుత్వ హయాంలో వికలాంగులు కోటాలో పింఛన్లు పొందుతున్న వారందరికీ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక సదరం క్యాంపు పెట్టి దానికి ఒక ప్రత్యేక వైద్యాధికారి నియమించి సచివాలయాలకు షెడ్యూల్ ఇచ్చి షెడ్యూల్ ప్రకారంగా సచివాలయ పరిధిలో ఉన్న వికలాంగుల అందరికీ సర్టిఫికేట్ల వెరిఫికేషన్ చేస్తున్నారు. అంతవరకు బాగానే ఉన్నప్పటికీ కురుపాం సామాజిక ఆరోగ్య కేంద్రంలో గల పలు గిరి శిఖర గ్రామాల నుంచి సదరం సర్టిఫిట్ వెరిఫికేషన్ కోసం బుధవారం ఉదయం 8 గంటలకే సిహెచ్‌సికి వచ్చినప్పటికీ సంబంధిత సర్టిఫికెట్ల వెరిఫికేషన్ వైద్య అధికారి 11 గంటలు సమయం అయిన రాకపోవడంతో వికలాంగులు గంటల కొద్దీ నిరీక్షించాల్సి వచ్చింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అసలే తాము వికలాంగులం తాము ఒక్కరుగా వచ్చి ఏ పని చేసుకోలేమని తమకు తోడుగా తమ కుటుంబ సభ్యులు ఒకరు, ఇద్దరు చొప్పున వచ్చారని వారికి కూడా తమతో పాటు నిరీక్షణ తప్పడం లేదని వాపోయారు. రోజంతా తమతో ఉండడం వల్ల వారు వేరే పనులకు వెళ్లలేక ఇక్కడ గంటలు తరబడి ఉండడం ఓ పక్క ఖర్చు పెరుగుతోందని మరోపక్క గంటల తరబడి ఉండలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పారు. ఇప్పటికైనా సంబంధిత ఉన్నత అధికారులు స్పందించి సకాలంలో వైద్యాధికారి వచ్చి సదరం సర్టిఫికెట్లు వెరిఫికేషన్ చేయాలని కోరుతున్నామని అన్నారు.
