ప్రజాశక్తి – సాలూరురూరల్ : ఎన్నో ఏళ్లుగా ఆంధ్ర-ఒడిశా సరిహద్దు ప్రాంతంలో పోడు భూముల్లో వ్యవసాయం చేసుకొని జీవనం సాగిస్తున్న గిరిజన రైతులకు సంబంధించిన భూములను సర్వే చేసి పట్టాలను ఇవ్వాలని ఆదివాసీ గిరిజన సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం స్థానిక తహశీల్దారు కార్యాలయంలో నిరసన కార్యక్రమం నిర్వహించి అనంతరం వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా గౌరవాధ్యక్షులు సీదరపు అప్పారావు మాట్లాడుతూ ఎన్నో పోరాటాల ఫలితంగా గిరిజనులు సాగుచేస్తున్న భూములకు అధికారులు సర్వే చేశారని, అయితే వాటికి సంబంధించిన పట్టాలను మాత్రం ఇప్పటికీ అందజేయలేదని అన్నారు. ముఖ్యంగా మండలంలోని బొర్రా పనుకువలస, జిల్లేడువలస గిరిజనులకు ఇచ్చిన హామీని అమలు చేయాలని అనేకసార్లు రెవెన్యూ అధికారులను వేడుకుంటున్నా ఇప్పటివరకు పట్టించుకోవడం లేదని వాపోయారు. ఆంధ్ర ఒడిస్సా సరిహద్దు ప్రాంతమైన గంజాయిభద్ర పంచాయతీలో సాగు చేస్తున్న భూములకు సర్వేలు నిర్వహించి అటవీ పట్టాలు ఇవ్వాలన్నారు. పట్టాలు లేక పోవడంతో ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు, పంట నష్టపరిహారం అందడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో సర్వే చేసిన వారికి పూర్తిస్థాయిలో పట్టాలు ఇవ్వలేదని, అలాగే అనేక గ్రామాల్లో సర్వే కూడా చేయలేదన్నారు. గంజాయిభద్ర పంచాయతీలో కొటియా సరిహద్దు గ్రామాల్లో పూర్తిస్థాయిలో సర్వేలు చేయలేదని, ధూళిభద్రలో 50 మందికి పైగా లబ్ధిదారులకు పట్టాలు లేవన్నారు. దీనిపై గతంలో ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో జిల్లేడువలస, బొర్రపనులు వలస గ్రామాల గిరిజనులు పోరాటం చేయగా, పట్టాలు పంపిణీ చేస్తామని అధికారులు హామీ ఇచ్చినా అమలు చేయలేదన్నారు. అలాగే పట్టాలు లేకుండా చేసిన అప్పటి విఆర్‌ఒ, తహశీల్దారుపై చర్యలు తీసుకుంటామని పై అధికారులు హామీ ఇచ్చినా నేటికీ ఆ హామీనీ అమలు చేయలేదు సరికదా పట్టాలిస్తామంటూ కాలయాపన చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా పట్టాలు పంపిణీ చేయాలని, సర్వే కాని వారందరికీ సర్వేలు చేసి పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఆదివాసీ గిరిజన సంఘం మండల అధ్యక్షులు గెమ్మెల జానకిరావు, వంతల సుందరరావు, గెమ్మెల జిత్తు, పూలు పాల్గొన్నారు.
