మక్కువ: జీవితకాలం తోడునీడుగా బతకాల్సిన వారు అర్ధాంతరంగా ఆయుష్షు తీరిపోయి తను చాలించడంతో ఒంటరిగా జీవితం నెట్టుకు రావాల్సి పరిస్థితి వారిది. ఆర్థికస్థోమత లేక ప్రభుత్వం పింఛను రూపంలో చేయూత అందిస్తోందని ఆశగా ఎదురుచూసిన వారికి నిరాశే మిగులుతుంది. సమాజంలో అనేక అవమానాలను భరిస్తూ మేమేం చేశాం పాపం… మాకెందుకు ఈ శాపం అంటూ రోధిస్తున్న వితంతువులు ఎందరో. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ గత ప్రభుత్వం నుంచి దరఖాస్తులు చేసుకున్నప్పటికీ ఏళ్ల తరబడి వితంతు పెన్షన్ కోసం ఎదురుచూసిన వారి కంటే కొద్దికాలంలో వితంతువులుగా మారిన మహిళలకు పెన్షన్ వస్తూ తమకు రాకపోవడంతో మేము వితంతువులం కాదా బాబు అంటూ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నా తీరును చూసిన వారికి కంటతడి తెప్పించక మానదు. కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం వల్ల ఏళ్ల తరబడి వితంతువులుగా మారిన వారికి అవస్థలు తప్పడం లేదు. కొంతకాలంగా ప్రారంభానికి నోచుకోని పింఛన్ల నమోదు ప్రక్రియ కార్యక్రమం గతేడాది నవంబర్ నుంచి పనిచేస్తుంది. ఈ ప్రక్రియ ప్రారంభం కావడంతో వితంతువులందర్లో ఆనందాలకు అవధుల్లేకుండా పోయాయి. కానీ ఇంతలోనే గతేడాది వితంతువులుగా మారిన వారిని వెబెసైట్ తీసుకోకపోవడంతో వారిలో కలవరం మొదలైంది. 2024 నవంబర్ నుంచి వితంతువులుగా మారిన వారికి మాత్రమే వెబ్సైట్లో దరఖాస్తు చేసుకునే ఆస్కారం కల్పిస్తుంది. దీంతో మండలంలోని 21 పంచాయతీల్లో ఏళ్ల తరబడి ఎదురుచూస్తూ ఉన్న వితంతువులు ఆయా కార్యాలయాల చుట్టూ తిరిగినా అధికారులు చేతులెత్తేస్తున్నారు. ప్రభుత్వ వెబ్సైట్‌లో ఉన్న కాస్త లోపాన్ని సవరణ చేస్తే తప్ప ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్న వితంతువులకు పెన్షన్ వచ్చే ఆస్కారం లేదు. ఇప్పటికే ఈ పెన్షన్ కోసం గత ప్రభుత్వంలో దరఖాస్తు చేసుకున్న వారికి ఎన్నికల నిబంధనలు అడ్డు రావడంతో అలాగే ఉండిపోయారు. కూటమి ప్రభుత్వం వితంతు పెన్షన్లకు అవకాశం కల్పించినప్పటికీ పాత వారికి చోటు దక్కడం లేదు. దీంతో వేలాదిమంది వితంతువులు కలత చెందుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఏళ్ల తరబడి పెన్షన్ కోసం నిరీక్షిస్తున్న వితంతువులకు పెన్షన్ అందేలా చూడాలని వారంతా రోధిస్తున్నారు. అందరికీ పెన్షన్ మంజూరు చేయాలని ఏళ్ల తరబడి నిరీక్షిస్తున్న వితంతువులు కోరుతున్నారు.దాతల సాయం తో జీవనం గడుపుతున్నా.నా భర్త పాపారావు ఉన్నంత వరకూ రజక వృత్తితో జీవనం సాగించే దాన్ని. ఆయన మరణించాక బతుకు దుర్భరంగా మారింది. ఒంటరిని అయినందున వృత్తిని కొనసాగించలేకపోతున్నాను. గ్రామంలో దాతల సహాయంతో జీవనం గడపాల్సి వస్తుంది. ఇప్పటికైనా ప్రభుత్వం పింఛను ఇచ్చి ఆదుకోవాలి. నారాయణపురం బంగారమ్మ , కన్నంపేట.కూలికి వెళ్తేనే పొట్ట గడుస్తుంది నా భర్త సూర్యనారాయణ చనిపోయిన నాటి నుండి కూలీనాలీ చేసి బతుకు సాగుతుంది. పింఛను కోసం ప్రభుత్వ కార్యాలయాలకు పలుమార్లు విజ్ఞప్తులు ఇచ్చాం. రేపు, మాపు పెన్షన్ వస్తాదని ఎదురు చూస్తూనే ఉన్నాం. ఏడాది కావస్తున్నా పింఛను మంజూరు కాలేదు. ప్రభుత్వం పింఛను మంజూరు చేసి ఆదుకోవాలి.చింతల కాంతమ్మ, కన్నంపేట.గత ప్రభుత్వం చివర్లో దరఖాస్తు చేసుకున్నాభర్త అప్పలనాయుడు చనిపోయి ఏడాదిన్నర కావస్తున్నా ఇప్పటికీ పెన్షన్ రాలేదు. గత ప్రభుత్వంలో దరఖాస్తు చేసుకున్నప్పటికీ ఎన్నికల కోడ్ రావడంతో ఆ ప్రక్రియ ఆపేసింది. కూటమి ప్రభుత్వం పింఛన్ మంజూరు చేసి ఆదుకోవాలి.ఎల్.సత్యవత్తమ్మ, కొండ బుచ్చంపేట.
