పార్వతీపురం: విభిన్న ప్రతిభావంతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ, గిరిజన సంక్షేమశాఖా మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. గురువారం ఐటిడిఎ ప్రాంగణంలో అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు ఎమ్మెల్యేలు తోయక జగదీశ్వరి, బోనెల విజయచంద్ర, నిమ్మక జయకృష్ణ, ఐటిడిఎ పిఒ అశుతోష్ శ్రీవాత్సవ పాల్గొన్నారు. ఈ సందర్బంగా సంధ్యారాణి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వికలాంగుల సంక్షేమం కోసం ప్రతీ నెలా ఇచ్చే మూడు వేల పెన్షన్ ను ఒకేసారి ఆరు వేల రూపాయలకు పెంచి, వారు ఎందులోనూ తక్కువ కాకూడదని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని అన్నారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి పది వేలు, పూర్తిగా మంచానికి పరిమితమైన వికలాంగులకు పదిహేను వేల రూపాయలను పెన్షన్ గా ఇస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానిదేనని మంత్రి అన్నారు. చాలా మంది విభిన్న ప్రతిభావంతులు పభుత్వ ఉద్యోగాలు సాధించి అత్యున్నత స్థితికి చేరుకున్నారని, అలాంటి వారిని స్ఫూర్తిగా తీసుకుని మీరు కూడా ఉన్నత స్థాయికి చేరుకోవాలని సూచించారు. త్వరలోనే జిల్లాలో వికలాంగుల కోసం మెడికల్ క్యాంపు పెడతామని తెలిపారు. ఎవరికైనా మూడు చక్రాల వాహనం, చెక్క కాలు, చేతి కర్రలు ఎవరికీ కావాలన్నా దరఖాస్తు చేసుకుంటే వెంటనే మంజూరు చేస్తామని పేర్కొన్నారు. ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి మాట్లాడుతూ వికలాంగుఉల ఏ పని మొదలుపెట్టినా సాధించి తీరుతారని అన్నారు. చదువులో అయిదు శాతం రిజర్వేషన్ విభిన్న ప్రతిభావంతులకు కేటాయించారని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో నాలుగు శాతం రిజర్వేషన్ కల్పించామని ఆమె తెలిపారు. ఎమ్మెల్యే బోనెల విజయ చంద్ర మాట్లాడుతూ పారా ఒలంపిక్స్ క్రీడా పోటీల్లో సుమారు 54 మంది దివ్యాంగులు పాల్గొని 7 బంగారు పతకాలు, 4 సిల్వర్, 8 కాంస్యం బహుమతులు గెలుచుకున్నారని తెలిపారు. అనంతరం క్రీడా పోటీలలో గెలుపొందిన దివ్యాంగులకు బహుమతి ప్రదానం చేశారు. కార్యక్రమంలో జిల్లా దివ్యాంగుల సంక్షేమ శాఖ అధికారి కె. కవిత, వివిధ మండలాల నుండి వచ్చిన వికలాంగులు పాల్గొన్నారు.
