ప్రజాశక్తి – సాలూరురూరల్ : అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను ప్రజలలోకి విస్తృతంగా తీసుకొని వెళ్లాలని దీనికోసం ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా కృషి చేయాలని రాష్ట్ర స్త్రీ, శిశుసంక్షేమ, గిరిజనశాఖా మంత్రి జి.సంధ్యారాణి అన్నారు. శనివారం తన క్యాంప్ కార్యాలయంలో నియోజకవర్గ టిడిపి కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కుటుంబ సారధులను నియమించుకొని గ్రామ, వార్డు స్థాయిల్లో పార్టీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించుకుని మూడు నెలలకు ఒకసారి నియోజకవర్గ స్థాయిలో అప్పటివరకు జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి చర్చించాలని అన్నారు. అభివృద్ధి పనులను అడ్డుకుంటే అభివృద్ధి ఎలా సాధిస్తామని వైసిపి నాయకులకు మంత్రి ప్రశ్నించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఆర్‌పి భంజిదేవ్ మాట్లాడుతూ సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తుంటే వైసిపి నాయకులు దుష్ప్రచారాన్ని ప్రారంభించారని, దీన్ని ప్రతి కార్యకర్త తిప్పికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. సమావేశంలో సాలూరు పట్టణ, మండల, పాచిపెంట, మక్కువ, మెంటాడ మండలాల టిడిపి అధ్యక్షులు నిమ్మాది తిరుపతిరావు, ఆముదాల పరమేష్, పిన్నింటి ప్రసాద్ బాబు, గుళ్ల వేణుగోపాలరావు, చలుమూరి వెంకట్రావు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, సర్పంచులు, ఎంపిటిసిసభ్యులు పాల్గొన్నారు.
