ప్రజాశక్తి – సాలూరురూరల్: ఆంధ్రా- ఒడిశా సరిహద్దుల్లో నిత్యం వివాదాలు సృష్టిస్తున్న ఒడిశా దూకుడును అరికట్టేది ఎప్పుడని సరిహద్దు గ్రామాల గిరిజనలు ఆందోళన వ్యక్తంచేశారు. ఈ మేరకు మంగళవారం సిపిఎం ఆధ్వర్యంలో ఎగువ సెంబి వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి మర్రి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఒడిశా- ఆంధ్రా సరిహద్దు వివాదాల వల్ల 21 గ్రామాలకు చెందిన గిరిజనులు ఇబ్బంది పడుతున్నారన్నారు. ఈ ప్రాంతమంతా ఐదో షెడ్యూల్ గ్రామాలుగా ఉన్నాయని, ఇక్కడ ఉండే గిరిజనులకు సర్వహక్కు లున్నాయని సుప్రీం కోర్టు చెబుతున్నా ఒడిశా అధికారులు, పోలీసులు దూకుడుగా వ్యవహరిస్తూ గిరిజనుల సాగులోనున్న భూములను దౌర్జన్యం చేస్తూ లాక్కోవడానికి ప్రయత్నించడం సరికాదన్నారు. ఒడిశా దూకుడును అడ్డుకోవాల్సిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కనీసం స్పందించడం లేదని తెలిపారు. ఎన్నో ఆశలతో గెలిపించుకున్న గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి కనీసం స్పందించడం లేదని, ఇప్పటికైనా గిరిజనులకు రక్షణ కల్పించి ఈ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. గిరిజనులు సాగుచేస్తున్న భూములపై ఎటువంటి అనుమతుల్లేకుండా గ్రామసభల ఆమోదం లేకుండా గిరిజనులకు తెలియకుండా వారి భూమిలు లాక్కుని కంచెలు వేసి ఇబ్బంది పెట్టడం సరికాదని తెలిపారు. తక్షణమే వేసిన కంచెను తొలగించాలని డిమాండ్ చేశారు. ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి సరిహద్దు వివాదం పరిష్కారం కోసం కషి చేయాలని డిమాండ్ చేశారు. లేనిచో గిరిజనులందర్నీ సమీకరించి ఆందోళన చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో సిపిఎం మండల కమిటీ సభ్యులు గెమ్మెల జానకీరావు, కోనేటి సుబ్బా, తాడంగి చరణ్, చిరంజీవి, సన్నం, మర్రి మహేషు, గ్రామ గిరిజనులు పాల్గొన్నారు.