గొంతు తడిపేదెప్పుడు?

Sep 30,2024 21:19

ప్రజాశక్తి – వీరఘట్టం : తాగునీరు లేక తమ గొంతులు ఎండుతున్నాయని, కుళాయి పాయింట్లు ద్వారా పూర్తిస్థాయిలో తాగునీరు ఎప్పుడు సరఫరా చేస్తారని మండల కేంద్రంలోని కస్పా వీధికి చెందిన దళిత మహిళలు సోమవారం మేజర్‌ పంచాయతీ ఇఒ ఎం.రవి వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. రక్షిత మంచినీటి పథకం కుళాయిల ద్వారా గత రెండు నెలల నుంచి తమ వీధికి తాగునీరు సక్రంగా సరఫరా కాకపోవడంతో గొంతు తడుపుకొనేందుకు గుక్కెడి నీటి కోసం ఎగువ ప్రాంతానికి వెళ్లి నీరు తెచ్చుకొని దాహార్తిని తీర్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ వీధుల్లో ఏర్పాటు చేసిన కుళాయి పాయింట్ల ద్వారా కొద్దిపాటి నీరు రావడంతో నీటి కోసం గంటల తరబడి నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నారు. తాగునీరు సక్రమంగా సరఫరా కావడం లేదని సెప్టెంబర్‌ 12న వినతిని ఇచ్చినప్పటికీ కనీసం చర్యలు తీసుకోలేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా పంచాయతీ అధికారులు స్పందించి తక్షణమే తాగునీటి సమస్య పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని దళిత మహిళలు ఇఒను కోరారు.

➡️