గుమ్మలక్ష్మీపురం: మన్యం జిల్లాలోని కురుపాం నియోజకవర్గంలో అడవి ఏనుగులు సమస్య ప్రజలను, రైతులను పట్టిపీడిస్తోంది. రాత్రి, పగలు అన్న తేడా లేకుండా అడవి ఏనుగుల సంచారం గ్రామాల్లో, పొలాల్లో ఉండడంతో ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా పోతుంది. నియోజకవర్గంలో నదీపరివాహ ప్రాంతం ఉండడం, పుష్కరమైన పంటలు ఆహారంగా లభించడంతో ఈ ప్రాంతాన్ని ఆవాస ప్రాంతంగా ఏనుగులు ఏర్పర్చుకున్నాయి. గత 18 ఏళ్లుగా అడవి ఏనుగుల సమస్య ఉన్నా అటు ప్రభుత్వం గానీ, ఇటు అధికారులు గానీ రక్షణ చర్యలు చేపట్టడంలో పూర్తిగా విఫలమయ్యారు. ప్రతిరోజు ఏదో ఒక ఊరి లోకి చొరబడి పంటలను, ఆస్తులపై దాడి చేసి తీవ్ర నష్టం కలిగించడం ఏనుగుల సమస్యతో ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా పోతుంది. ఇప్పటికే ఏనుగు దాడిలో 18 మంది వరకు మృత్యువాతపడ్డారు. వేలాది ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. కుంకీ ఏనుగులను తీసుకువచ్చి అడవి ఏనుగుల సమస్యకు పరిష్కారం చూపుతామని ప్రభుత్వం ప్రకటించినా చర్యలు మాత్రం కాన రాలేదు. మొన్న కొమరాడ మండలంలో పామా యిల్ తోటను, నిన్న కురుపాం మండలంలో కర్బూజా పంటను, నేడు జియ్యమ్మవలస మండ లం పెదమేరంగిలో రైస్‌మిల్‌పై అడవి ఏనుగులు గుంపు నాశనం చేశాయి. చేతికి వచ్చిన పంట పూర్తిగా నష్టపోవడంతో రైతులు లబోదిబోమం టున్నారు. రాత్రి సమయాల్లో ఫారెస్ట్ సిబ్బంది, ఎలిఫెంట్ ట్రాకర్లు లేకపోవడంతో ఎక్కువ ఆస్తి, పంట నష్టాలు జరుగుతున్నాయని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. అడవి ఏనుగుల సమస్యకు ప్రభుత్వం పరిష్కారం చూపాలని, రైతులకు నష్ట పరిహారం చెల్లించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి కొల్లి గంగునాయుడు డిమాండ్ చేశారు.
