సీతానగరం: ఫిబ్రవరి 1, 2, 3 తేదీల్లో నెల్లూరులో జరగబోయే సిపిఎం 27వ రాష్ట్ర మహాసభ లను జయప్రదం చేయాలని, అందుకు విరివిగా విరాళాలిచ్చి సహకరించాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు రెడ్డి వేణు కోరారు. శనివారం సీతానగరం సంత బజార్లో ప్రచారం చేస్తూ విరాళాలు సేకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిపిఎం రాష్ట్ర మహాసభలను పురస్కరించుకుని గత మహాసభల్లో తీసుకున్న నిర్ణయాలు, ప్రజల పోరాటాలు, విజయాలు, వైఫల్యాలు సమీక్షిస్తారన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చిన తర్వాత సామాన్యులపై విపరీతమైన భారాలు పెరిగాయని, దేశంలో మతోన్మాద శక్తులు ఎక్కువై పోతున్నాయని అన్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ ఏదీ అమలు చేయలేదన్నారు.భోగి మంటల్లో విద్యుత్ బిల్లులను దహనం విద్యుత్ సంస్కరణ పేరుతో ప్రజలపై భారాలు కూటమి ప్రభుత్వం వేస్తుందని, వీటిని ప్రజా పోరాటాల ద్వారా తిప్పికొట్టాలని వేణు అన్నారు. పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని, ట్రూ అప్ ఛార్జీలు రద్దు చేయాలని భోగి మంటల్లో విద్యుత్ బిల్లులను దహనం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సిపిఎం మండల కమిటీ సభ్యులు రెడ్డి లక్ష్మునాయుడు, రెడ్డి రమణమూర్తి, జి.వెంకటరమణ, ఆర్.రాము, బి.అప్పారావు, వై.రామారావు పాల్గొన్నారు.