వీరఘట్టం: ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా యుటిఎఫ్, ఇతర అధ్యాపక, ఉపాధ్యాయ సంఘాలు బలపరుస్తున్న పిడిఎఫ్ అభ్యర్థి కోరెడ్ల విజయగౌరికి మొదటి ప్రాధాన్యత ఓటువేసి గెలిపించాలని యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎస్.మురళీమోహనరావు కోరారు. ఈ మేరకు మండలంలోని కంబరవలస, వీరఘట్టం (బాలురు), (బాలికలు), కెజిబివి, ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలలు కాలేజీలు, నర్సిపురం, గంగమ్మపేటలోని గిరిజన సంక్షేమ ఆశ్రమోన్నత పాఠశాల, కత్తుల కవిటి, బిటివాడ తదితర జెడ్పీ ఉన్నత పాఠశాలల్లో యుటిఎఫ్ శ్రేణులు సోమవారం విస్తృతంగా ప్రచారాన్ని చేపట్టాయి. ఈ సందర్భంగా మురళీమోహన్ రావు మాట్లాడుతూ విజయగౌరి విద్యార్థి దశ నుంచే ఎస్‌ఎఫ్‌ఐ ఉద్యమాల్లో కీలకంగా పనిచేశారు. ఉపాధ్యాయ వృత్తి ప్రారంభం రోజుల నుంచి నేటి వరకు యుటిఎఫ్‌లో సంఘంలో కీలకంగా పని చేశారన్నారు. యుటిఎఫ్ చేసే ఉద్యమాల్లో, ఫ్యాప్టో, జెఎసి చేపట్టే ఐక్య ఉద్యమాల్లో ముందు వరుసలో ఉండి సమస్యలపై గళమెత్తారని తెలిపారు. ఉన్నత పాఠశాలలో చదివే బాలికలు న్యాప్ కిన్స్ సాధించడానికి మహిళా ఉపాధ్యాయుల్ని ఏకం చేసి ఉద్యమాలు ద్వారా సరఫరా జరిగేలా పోరాడాలని తెలిపారు. కెజిబివి, ఎపి మోడల్ స్కూల్, మహిళా ఉపాధ్యాయుల సమస్యలపై జరిగే ఉద్యమాలికి నాయకత్వం వహించారని తెలిపారు. విజయగౌరి ని శాసనమండలికి పంపించాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందని, కావున ఉత్తరాంధ్ర ఉపాధ్యాయలంతా మీ మొదటి ప్రాధాన్యత ఓటును విజయగౌరికి వేసి గెలిపించాల్సి అభ్యర్థించారు. ప్రచారంలో యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి మజ్జి పైడిరాజు, మండల అధ్యక్షులు బోనంగి దుర్గాప్రసాద్, రాష్ట్ర కల్చరల్ కమిటీ సభ్యులు కొండపల్లి గౌరునాయుడు పాల్గొన్నారు.
