ప్రజాశక్తి – సీతానగరం : గర్భిణీ, బాలింత, శిశువుల్లో ప్రమాద సంకేతాలు గుర్తించి మాతా, శిశు ఆరోగ్యమే ధ్యేయంగా కషి చేయాలని వైద్యారోగ్యశాఖ జిల్లా ప్రోగ్రాం అధికారి డాక్టర్ టి. జగన్మోహనరావు వైద్య సిబ్బందికి సూచించారు. మండలంలోని పెదంకలాం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం నిర్వహించిన ఆశా డే కార్యక్రమంలో ఆయన పాల్గొని పలు సూచనలు చేశారు. గర్భిణీ నమోదైనప్పటి నుండి ప్రసవం పూర్తయ్యే వరకు నిశితమైన ఆరోగ్య పర్యవేక్షణ తప్పనిసరి అని అలాగే త్వరితగతిన గర్భిణీ నమోదు చేపట్టాలని అన్నారు. కావున హైరిస్క్ సమస్యలను సత్వరమే గుర్తించి వైద్య పరీక్షలు జరిపి ప్రమాదస్థాయికి చేరకుండా ముందస్తు జాగ్రత్త పడాలని సూచించారు. గర్భిణీ, ప్రసవ సమయంలో ప్రసవానంతరం ఏవైనా ప్రమాద సంకేతాలు గుర్తిస్తే రక్తపోటు, పిండం హృదయ స్పందన, గర్భాశయ ముఖ ద్వారం నుండి స్రావం, కాన్పు నొప్పులు అధికంగా ఎక్కువ సమయం ఉండటం, మూత్ర విసర్జన సమయంలో మంటగా ఉండటం, జ్వరం తదితర అంశాలను పరిశీలించాలని అన్నారు. బిడ్డకు పుట్టిన 24 గంటల్లోపే టీకాలు వేయించాలన్నారు. ఆశాలు, వైద్య సిబ్బంది తరచుగా గర్భిణి, బాలింతల గృహ సందర్శనలు చేస్తూ ఐరన్, కాల్షియం మాత్రలు, పౌష్టికాహారం తీసుకోవడం, శిశువుల్లో శ్వాస సమస్యలు ఉన్నాయా అని గుర్తించడం, తల్లిపాలు పట్టే విధానంపై అవగాహన కల్పించడం, ఇంకా ఏవైనా ఆరోగ్య సమస్యలుంటే గుర్తించడం చేస్తూ గర్భిణీ, బాలింత, శిశువుల ఆరోగ్య నివేదికలను ఎప్పటికపుడు విశ్లేషిస్తూ అసాధారణ నివేదికలు, సంకేతాలను గుర్తిస్తే తక్షణమే తగు వైద్యం అందేలా చర్యలు చేపట్టాలని సూచించారు. పిహెచ్‌సిలో ప్రసవాల సంఖ్య మెరుగుపడాలన్నారు. దీర్ఘకాలిక రోగులను క్షేత్ర స్థాయిలో పర్యవేక్షణ చేస్తూ వారి ఆరోగ్యం ఏ మేరకు మెరుగు పడుతున్నదోనని గమనించాలని ఆయన సూచించారు. వైద్య, అంగన్వాడీ సిబ్బంది సమన్వయంతో మాతా, శిశు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. కార్యక్రమంలో ఈఓ సూర్యనారాయణ, సూపర్వైజర్ వరలక్ష్మి, ఎఎన్‌ఎంలు, వైద్య సిబ్బంది ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.