కిశోర వికాసం.. భవిష్యత్తుకు పునాది

Dec 10,2024 22:16

ప్రజాశక్తి-గరుగుబిల్లి : బాలిలకు కిశోర వికాసం కార్యక్రమం ఒక వరమని, అది వారి బంగారు భవిష్యత్తుకు పునాది వేస్తుందని ఐసిడిఎస్‌ పీడీ ఎన్‌.ఎం.రాణి తెలిపారు. స్థానిక ఎంపిడిఒ కార్యాలయంలో మంగళవారం కిశోర వికాసం కార్యక్రమంపై శిక్షణ ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతీ బాలిక తన పూర్తి సామర్థ్యాన్ని తెలుసుకునేలా, సమగ్ర అభివృద్ధి సొంతం చేసుకునేలా ఈ కార్యక్రమం ద్వారా చేయూతనిస్తున్నట్లు తెలిపారు. కిశోర బాలికలకు విద్య, ఆరోగ్యం, భద్రత, ఆర్థిక స్వావలంబనను మెరుగుపరచడం ఈ కార్యక్రమం లక్ష్యమని తెలిపారు. ఇందుకోసం ప్రతి గ్రామంలోనూ బాలికల సంఘాలను ఏర్పాటు చేసి అవగాహన కల్పించడంతోపాటు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఎంపిడిఒ జి.పైడితల్లి మాట్లాడుతూ కిశోర బాలికలకు సరైన విజ్ఞానం అందించి, జీవితంలో అన్ని విధాలా ఎదిగేందుకు కృషి చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఎస్‌ఐ పి.రమేష్‌నాయుడు మాట్లాడుతూ బాలికలకు ఆత్మరక్షణ శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేస్తామన్నారు. డిజిటల్‌ భద్రత, సైబర్‌ క్రైమ్‌పై అవగాహన కల్పిస్తామని తెలిపారు. కార్యక్రమంలో కొమరాడ ఐసిడిఎస్‌ ప్రాజెక్టు అధికారి గొట్టాపు సుగుణకుమారి, డిసిపిఒ ఎ.సత్యనారాయణ, వైద్యాధికారి కెకె సాగర్‌ వర్మ, ఇఒపిఆర్‌డి ఎల్‌.గోపాలరావు, ఐసిడిఎస్‌ సూపర్‌వైజర్లు రౌతు లక్ష్మి, అరుణకుమారి, అంగన్వాడీ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

➡️