ప్రజాశక్తి-విజయనగరంటౌన్/కోట : సంక్రాంతి పండగ నేపథ్యంలో సోమవారం నగరంలో మార్కెట్ కళకళలాడింది. వస్త్ర మార్కెట్‌తోపాటు నిత్యావసర సరుకులు కొనుగోలు చేసే గంటస్తంభం మార్కెట్, కిరాణాషాపులు, వంట నూనె షాపులు కొనుగోలుదారులతో కిటకిటలాడాయి. ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో ఎటు చూసినా ఇసుక వేస్తే రాలనంత జనంతో నిండిపోయింది. మార్కెట్‌లో అడుగుపెట్టాలంటే.. పెద్దచెరువు గట్టు, సత్యలాడ్జి, రాజీవ్ క్రీడా మైదానం వద్ద వాహనాలు విడిచిపెట్టి లోపలికి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రధానంగా బుధవారం సంక్రాంతి నేపథ్యంలో పిండి వంటలకు అవసరమైన బెల్లం, పప్పులు, నూనె తదితర సామాగ్రి కొనుగోలు చేసేందుకు గ్రామీణ, పట్టణ ప్రాంతాల నుంచి వచ్చిన జనంతో పిడబ్ల్యుమార్కెట్ కిక్కిరిసిపోయింది. మరోవైపు రహదారులపై చెరకు గడలు, ఎర్ర దుంపలు, బట్టలు కొనుగోలు చేసే వారంతా ఆయా ప్రాంతాలు ఖాళీ లేకుండా పోయాయి. ఎటు చూసినా కొనుగోలుదారులతో మార్కెట్ రద్దీ నెలకొనడంతో గంటల కొద్ది ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. రైల్వేస్టేషన్‌రోడ్డు, ఎంజి రోడ్డు, ఉల్లివీధి, కన్యకాపరమేశ్వరి ఆలయం తదితర ప్రాంతాలు రద్దీగా మారాయి. దీంతో కొన్నిచోట్ల పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.