ప్రజాశక్తి – పార్వతీపురం టౌన్ : దసరా పండగను పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని ప్రధాన రహదారిలో ఉన్న మార్కెట్ అమ్మకం, కొనుగోలుదారులతో శుక్రవారం కిటకిటలాడింది. శనివారం విజయదశమి సందర్భంగా భారీ, ద్విచక్ర వాహనదారులు, వ్యాపారస్తులు, యంత్ర సామాగ్రి ఉన్న ప్రతి ఒక్కరూ ఆయుధ పూజ కోసం సింధూరం, దిష్టి సామగ్రి, నిమ్మకాయలు, నల్ల జీడి పిక్కలు, అలంకరణ సామాగ్రి, పూజా సామాగ్రి, కొబ్బరికాయలు, పండ్లు, పత్రి, పూలు కొనుగోలుకు అధిక సంఖ్యలో పరిసర ప్రాంతాల నుంచి రావడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. వాహన చోదకులు, పాదచారులు ప్రధాన రహదారిపై రాకపోకలు సాగించేందుకు అవస్థలు పడ్డారు. పండగ సమయాల్లో ప్రధాన రహదారిలో ట్రాఫిక్ నియంత్రణపై దృష్టి పెట్టాల్సిన పోలీస్ శాఖ ఎటువంటి చర్యలు చేపట్టకపోవడంతో రహదారిపై వ్యాపారాలు సాగించే చిరు వ్యాపారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న తీరుపై స్థానికులు విమర్శలు గుప్పించడం విశేషం.
