ప్రజాశక్తి-సీతంపేట : సీతంపేట ఏజెన్సీలో వెలుగు, విడివికెల ద్వారా జీడి పిక్కలను కొనుగోలు చేసి మార్కెట్ ధర కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఐటిడిఎ హార్టికల్చర్ అధికారి ఎస్‌వి గణేష్ తెలిపారు. మండలంలో గొయిది గ్రామంలో బుధవారం వెలుగు, ఉద్యాన, వ్యవసాయ శాఖల ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళా సంఘాలు, వన్‌ధన్ వికాస్ కేంద్రాల ద్వారా అప్పుడున్న ధరలను బట్టి జీడి కొనుగోలు చేస్తామని చెప్పారు. మహిళా సంఘాలు ఆర్థిక అభివృద్ధి చెందడానికి చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఇప్పటికే సీతంపేట విడివికెల ద్వారా 1800 మంది మహిళా రైతులను గుర్తించినట్లు తెలిపారు. జీడి పరిశ్రమలు స్థాపించి, జీడి పిక్కలను ప్రాసెసింగ్ చేసి టిటిడికి, జిసిసికి విక్రయించేందుకు చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. మార్చి నెలలో జీడి తయారయ్యే సరికి కొనుగోలు ప్రక్రియ మొదలు పెడతామన్నారు. మహిళా రైతులకు చేయూతనివ్వడానికి కలెక్టర్ ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు. ఈ సమావేశంలో వ్యవసాయ అధికారి పి.శ్రీదేవి, జిల్లా శిక్షణ కోఆర్డినేటర్ శ్రీనివాసరావు, మట్టి శాస్త్రవేత్త సౌజన్య, హెచ్‌ఒ జయశ్రీ, తదితరులు పాల్గొన్నారు.