నెల్లూరులో ఉవ్వెత్తున ప్రజా ఉద్యమాలు..!
ప్రజాశక్తి-నెల్లూరు ప్రతినిధి : నెల్లూరు జిల్లా కమ్యూనిస్టు ఉద్యమానికి ప్రత్యేక చరిత్ర ఉంది. బ్రిటీష్ ప్రభుత్వం నిరంకుశ విధానాలను ఒకవైపు తిప్పికొడుతూ, మరోవైపు దోపిడికి వ్యతిరేకంగా ప్రజలను సంఘటితం చేస్తూ ఎన్నో పోరాటాలను నిర్వహించారు. కార్మికులు, కర్షకులు, పేద, మధ్యతరగతి జనం కోసం ఎందరో ఉద్యమకారులు నిరంతరం పోరాటాలు చేశారు. జిల్లాలో జరిగిన వ్యవసాయ కూలి రేట్లు పోరాటం రాష్ట్ర చరిత్రలోనే నిలిచిపోయింది. భూ పోరాటంలోనూ పేదలకు పది వేల ఎకరాలు భూమి పంపిణీ చేశారు. ప్రస్తుతం దేశంలోనే అత్యంత కీలకంగా ఉన్న వ్యవసాయ కార్మిక సంఘం ఇక్కడే పురుడుపోసుకుంది. నిర్బంధాల నెదుర్కుంటూ సాగిన ఎన్నో పోరాటాలకు సింహపురి వేదికగా నిలిచింది. 1933-34 సంవత్సరం పుచ్చలపల్లి సుందరయ్య నేతృత్వంలో వ్యవసాయ కార్మికులను ఏకం చేశారు. విడవలూరు మండలం, అలగానిపాడు సుందరయ్య సొంత గ్రామం. ”అలగానిపాడు వ్యవసాయ కూలీ సంరక్షణ సంఘం” ఏర్పాటు చేశారు.1937 ఆగస్టు 1న అప్పటి కాంగ్రెస్ నాయకులు వెన్నెలకంటి రాఘవయ్య చొరవతో సంఘం ఏర్పడింది. దీనికి ఎంఎన్ రారు అధ్యక్షత వహించారు. నెల్లూరు జిల్లాకు చెందిన అనేక మంది వ్యక్తులు సభ్యులుగా చేరారు. 1938లో జులైలో రాష్ట్ర కమ్యూనిస్టు పార్టీ వ్యవసాయ కూలీలపై ఒక తీర్మానం చేసింది. అప్పట్లో భూ స్వాములతో పోరాడి వ్వవసాయ కార్మికులు కూలీ రేట్లు కమ్యూనిస్టుపార్టీ అధ్యర్యంలో సాధించుకున్నారు. 1938లో కమ్యునిస్టు నాయకులు, కార్యకర్తలు బస్వారెడ్డి శంకరయ్య తదితరులు నెల్లూరు,. కోవూరు, విడవలూరులో సమ్మె ప్రారంభించారు. వ్యవసాయ కార్మికులకు రోజు కూలీ ముంతకు తగ్గరాదని, పాలేర్లకు రెండు తూముల నెలసరి బత్తా, పెట్టుబడి ఇవ్వాలని, పశువులు కాసేవారికి ఇళ్లలో పనిచేసేవారికి పెట్టుబడి పెంచాలని, పాలేర్లకు నెలకు 2 రోజులు సెలవులు ఇవ్వాలని, పొలం కంచెలలో పేదలు పశువులు మేపుకోవాలని, అడవుల నుంచి కూలీలను కట్టెలు తెచ్చుకోవాలనే డిమాండ్లతో 14 రోజులు సమ్మె నిర్వహించారు. ఈ సమ్మె అప్పట్లో వ్యవసాయ కూలీలపై పెద్ద ప్రభావమే చూపింది. నెల్లూరు, ఫైనాపురం, మామిడిపూడి, ఇందుకూరుపేట, టిపి గూడూరు గ్రామాల్లో సుమారు 3వేల మంది వ్యవసాయ కూలీలు 1938 జూలై, ఆగస్టులలో సమ్మె చేశారు. ఉవ్వేత్తిన సాగిన ఈ సమ్మెలో భూస్వాములు రాజీకి రాక తప్పలేదు. ఇది ఆరోజు కమ్యూనిస్టులు ఇతర నేతలు కలిసి చేసిన పెద్ద పోరాటంగా చెప్పొచ్చు. అటు తరువాత రాష్ట్రం, దేశ వ్యాపితంగా వ్యవసాయ కార్మిక సంఘం ఏర్పడి, పెద్ద సంఘంగా ఉంది. ఇందుకు నాంది పలికింది మాత్రం నెల్లూరు జిల్లాలో జరిగిన పోరాటం. కరువు జిల్లాల్లో నెల్లూరు, చిత్తూరు జిల్లాలో ఆకలి యాత్రలు నిర్వహించారు. ప్రభుత్వాలు నిర్వంధాలున్నప్పటికీ కమ్యూనిస్టులు పెద్ద ఎత్తున పోరాటం చేశారు. 1940-41 రాష్ట్రంలోని కృష్ణా, ఉభయ గోదావరి, నెల్లూరు జిల్లాలలో వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఆకలి యాత్రలు నిర్వహించారు. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో కమ్యూనిస్టులు జైల్లో ఉన్నా ఉద్యమం మాత్రం ఆగలేదు. ప్రతి రంగంలోనూ కమ్యూనిస్టుల కృషి..!నెల్లూరు జిల్లాలో జరిగిన ప్రతి ఉద్యమంలోనూ కమ్యూనిస్టులు విశేష కృషి చేశారు. వేగూరు గ్రామంలో కూలీలు సమ్మె చేశారు. దాదాపు మూడు నెలలు చేశారు. రైతాంగంలోనూ కమ్యూనిస్టులు (కాంగ్రెస్ సోషలిస్టు పార్టీల్లో) ఉంటూ 1937లో మద్రాసు రాష్ట్రానికి రాజగోపాలాచారీ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. జమీందారి విధానం రద్దు కావాలని, పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని, 1937లో ఇచ్చాపురం నుంచి మద్రాసు వరకు రైతు రక్షణ యాత్ర నిర్వహించారు. నెల్లూరులోనూ ఘనస్వాగతం పలికి, నేతలు పాల్గొన్నారు. 1931లో రైతు ఉద్యమాలు, జమీందారీ విధానాలకు వ్యతిరేకంగా ఆ రైతు సంఘాలు ఏర్పడ్డాయి. ఇవి అప్పట్లో కాంగ్రెస్ నాయకత్వంలో ఉండేవి. 1934లో కమ్యూనిస్టు పార్టీని నిషేదించారు. గుంటూరు, తెనాలి, నెల్లూరు, బందరు, విజయవాడలో సుందరయ్య, రావి ఆదిశేషయ్య కార్యదర్శులుగా పనిచేశారు. ప్రెస్ వర్కర్స్ 1934లో లక్నోలో ఆలిండియా ప్రెస్ వర్కర్స్ యూనియన్ ఏర్పడింది. 1935లో ముంబరు, 1936లో మద్రాసు, అఖిత భారత సభలు నిర్వహించారు. నెల్లూరు జిల్లాలోని ఈ సంఘం బాగా పనిచేసిందని చెబుతారు. రైల్వే కార్మిక సంఘం, మున్సిపల్ వర్కర్స్ సంఘం, 1938లో గూడూరు సమీపంలోని మైకా గని కార్మికులతో పోరాటాలు చేశారు.
