ప్రమాణస్వీకార వీక్షణకు భారీ ఏర్పాట్లు

Jun 11,2024 23:36

చిలకలూరిపేటలో ఏర్పాట్లను పరిశీలిస్తున్న పల్నాడు కలెక్టర్‌
ప్రజాశక్తి-పల్నాడు జిల్లా :
రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గన్నవరం విమానాశ్రయం వద్ద ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలకు చిలకలూరిపేట పట్టణ పరిధిలో చేస్తున్న ఏర్పాట్లను జిల్లా కలెక్టర్‌ శ్రీకేశ్‌ లత్కర్‌ బాలాజిరావు మంగళవారం పరిశీలించారు. చిలకలూరిపేటలోని శ్రీనివాస ఫంక్షన్‌ హాల్‌, గ్రాండ్‌ వెంకటేష్‌, ఎస్‌ఎంఎస్‌ షాది ఖానా, చౌడయ్య హెల్త్‌ క్లబ్‌ తదితర ప్రదేశాలను పరిశీలించి సదుపాయాలపై అడిగి పలు సూచనలిచ్చారు. సుదూర ప్రాంతాల నుంచి వస్తున్న వారికి వసతి సౌకర్యంతో పాటు ఉదయం పూట అల్పాహారం అందించాలన్నారు. మరుగుదొడ్ల సమస్య రాకుండా చూడాలన్నారు. కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ ఎ.శ్యాంప్రసాద్‌ వివిధ శాఖ అధికారులు పాల్గొన్నారు.

నరసరావుపేటలో ఏర్పాట్లను పరిశీలిస్తున్న అరవిందబాబు
చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం కార్యక్రమాన్ని నరసరావుపేట ప్రజలు ప్రత్యక్షంగా వీక్షించేందుకు ఎమ్మెల్యే డాక్టర్‌ చదలవాడ అరవిందబాబు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేట పట్టణంలోని టౌన్‌హాల్‌లో చేసిన ఏర్పాట్లను మున్సిపల్‌ కమిషనర్‌, ఇతర అధికారులతో కలిసి మంగళవారం పరిశీలించారు. ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి రాలేకపోయిన ప్రతి ఒక్కరూ ఇక్కడి నుండే కార్యక్రమాన్ని వీక్షించవచ్చని చెప్పారు.కార్యక్రమంలో కపిలవాయి విజరు కుమార్‌, మాబు, బడేబాబు, బాలు, మునిసిపల్‌, పోలీసు అధికారులు పాల్గొన్నారు.
ప్రజాశక్తి – సత్తెనపల్లి రూరల్‌ : ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేస్తున్న నేపథ్యంలో ప్రమాణ స్వీకారాన్ని తిలకించేందుకు డిజిటల్‌ తెరలు ఏర్పాటు చేసినట్లు సత్తెనపల్లి మున్సిపల్‌ కమిషనర్‌ కె.షమీ మంగళవారం తెలిపారు. పట్టణంలోని టిటిడి కళ్యాణ మండపంలో ఎల్‌ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ప్రజాప్రతినిధులతోపాటు అందరూ హాజరు కావాలని కోరారు.

➡️