ఎండిఎం కార్మికులకు బకాయి చెల్లించాలి

Apr 11,2025 20:52

ప్రజాశక్తి-విజయనగరం  :  డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు బకాయి ఉన్న బిల్లులు, గౌరవ వేతనాలు తక్షణమే చెల్లించాలని కోరుతూ జిల్లా విద్యాశాఖ అధికారి యు.మాణిక్యం నాయుడుకు మధ్యాహ్న భోజన పథకం కార్మిక సంఘం నాయకులు శుక్రవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి ఎ.జగన్మోహన్‌రావు, యూనియన్‌ నాయకులు టి .లక్ష్మి మాట్లాడుతూ నేటికి నాలుగు నెలలుగా బిల్లులు, జీతాలు, చెల్లించకపోతే పిల్లలకు ఎలా వండి పెట్టాలని ప్రశ్నించారు. విద్యా సంవత్సరం చివరి కావడంతో ఇప్పటికే కిరాణా షాపుల్లో వేలల్లో బకాయిలు ఉన్నాయని, అప్పులు చేసి తీరుస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. 2024 అక్టోబర్‌లో మెనూ ఛార్జీలు 5వ తరగతి లోపు పిల్లాడికి ఐదు రూపాయల 88 పైసల నుంచి 6:19 పైసలకు, ఎనిమిదో తరగతి లోపు పిల్లాడికి 8.57 నుంచి 9.26పైసలకు పెంచుతూ కేంద్రం ప్రకటించిందని, అందుకు అనుగుణంగా 2024 నవంబర్‌ నుంచి నూతన మెనూ కూడా అమలు చేస్తున్నారని, కానీ పాత రేట్లే బిల్లులు చేస్తున్నారు. కొత్తగా పెరిగిన మెనూ రేట్లు చెల్లించడం లేదని తెలిపారు. కనీసం పదివేల రూపాయలు నెలకు వేతనం ఇవ్వాలని రెండు జతల యూనిఫామ్‌ కాటన్‌ దుస్తులు, ఉచిత గ్యాస్‌ సరఫరా చేయాలని కోరారు. వినతి ఇచ్చిన వారిలో స్వప్న, లక్ష్మి మంగ, నారాయణమ్మ, ధనలక్ష్మి ,హేమ తదితరులు పాల్గొన్నారు.

➡️