ప్రజాశక్తి-రాయచోటి టౌన్ మాదక ద్రవ్యాల నిర్మూలనకు పకడ్బందీ కార్యాచరణ రూపొందించి ఆమలు చేయాలని అదనపు ఎస్‌పి (పరిపాలన) ఎం.వెంకటాద్రి అన్నారు. మంగళవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో ఈగల్ టీం సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో మాదక ద్రవ్యాల నివారణకు సంబంధించిన వ్యూహాలు, ప్రణాళికలు, అమలు గురించి చర్చించారు. ఈ సందర్భంగా వెంకటాద్రి మాట్లాడుతూ జిల్లాలో మాదక ద్రవ్యాల సమస్యను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి ఈ బందం చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. మాదకద్రవ్యాల వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించడం, విద్యార్థులు, యువతను మాదకద్రవ్యాల బారిన పడకుండా రక్షించడం, మాదకద్రవ్యాల కేసుల దర్యాప్తు, ప్రాసిక్యూషన్ వేగవంతం చేయడం, వివిధ కార్యక్రమాలను జిల్లాలో నిర్వహిస్తామని పేర్కొన్నారు. పాఠశాలలు, కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం, టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ 1972 ద్వారా సమాచారం సేకరించడం, మాదకద్రవ్యాల బారిన పడిన వారికి పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయడం ఈగల్ టీం ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. డాక్టర్ రసీదు లేకుండా మెడికల్ స్టోర్‌కి వస్తే మందులు ఇవ్వొద్దని చెప్పారు. అలా ఇస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విద్యార్థులలో డ్రగ్స్ వినియోగాన్ని గుర్తించడానికి, నిరోధించడానికి పాఠశాలల్లో ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల కోసం ఒక అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయాలని నిర్ణయించామని చెప్పారు. మాదకద్రవ్యాల సమస్యలతో బాధపడుతున్న విద్యార్థులను గుర్తించాలన్నారు. మాదకద్రవ్యాల విషయంలో ఎప్పటికప్పుడు కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. సమావేశంలో డిఇఒ కె.సుబ్రహ్మణ్యం, డిఎంహెచ్‌ఒ జి.ఉషాశ్రీ, రాయచోటి జైల్స్ సూపరింటెండెంట్ ఉమామహేశ్వరరావు, అసిస్టెంట్ డైరెక్టర్ ఆర్.వి.కృష్ణకిషోర్, డ్రగ్స్ ఇన్‌స్పెక్టర్ ఎస్.జయరాముడు, ఎక్సైజ్ సూపరింటెండెంట్ జి.మధుసూదన్, జిల్లా పంచాయతీ అధికారి ఎస్.మస్తాన్ వలీ, డిసిఆర్‌బి ఇన్‌స్పెక్టర్ ఎం.తులసిరామ్, సైబర్ సెల్ ఎస్‌ఐ చిరంజీవి, ఈగల్ సెల్ నెంబర్ ఎస్.ప్రతాప్ పాల్గొన్నారు.
