ప్రజాశక్తి – కడప జిల్లాలో రానున్న వేసవిలో నీటి ఎద్దడి సమస్య రాకుండా అన్ని ముందస్తు చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో తాగునీటి సమస్యలపై ఇరిగేషన్, మున్సిపల్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో తాగునీటి సమస్య రాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, శాశ్వత నీటి వనరులను గుర్తించాలని అన్నారు. రానున్న వేసవి కంత జిల్లాలోని చెరువులు, కుంటలు, సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులలను నీటితో నింపాలని అన్నారు. నీటి సరఫరాకు మోటార్లు, పైపులైన్లు మరమ్మతులు యుద్ధ ప్రాతికపదిన చేయాలన్నారు. నీటి సరఫరాకు సంబంధించి పనులు ఉంటే వెంటనే ప్రతిపాదనలు చేయాలని అన్నారు. ఏవైనా చిన్న చిన్న మరమ్మతులుంటే పూర్తి చేయాలన్నారు. ప్రజలకు నీటి కొరత లేకుండా ప్రాంతాలవారీగా నీటిని సరఫరా చేయాలన్నారు. జిల్లాలో తాగునీటిని నిరంతరంగా పరసరా చేసేందుకు శాశ్వత పనులను చేపట్టాలని అన్నారు. ప్రజలు నీటి కొరత వలన ఏమాత్రం ఇబ్బందులకు గురి కాకూడదని అందుకు సంబంధిత అధికారులే బాధ్యత వహించాలన్నారు. సమావేశంలో ఇరిగేషన్ సిఇ శ్రీనివాసులు, ఎస్‌ఇ వెంకటరామయ్య, మున్సిపల్ కమిషనర్ మనోజ్‌రెడ్డి, ఎపిఐఐసి జోనల్ మేనేజర్ శ్రీనివాస మూర్తి, డిఇ చెన్నకేశవ రెడ్డి, పబ్లిక్ హెల్త్ ఆఫీసర్ రమణమూర్తి పాల్గొన్నారు.
