ప్రజాశక్తి-మార్కాపురం : మార్కాపురం పట్టణంలోని డిఎస్‌పి కార్యాలయ ప్రాంగణంలో పోలీసు కుటుంబాల కోసం ప్రత్యేకంగా ఉచిత వైద్య శిబిరాన్ని శుక్రవారం నిర్వహించారు. పోలీస్ శాఖ-ఆస్టర్ రమేష్ ఆధ్వర్యంలో సంయుక్తంగా నిర్వహించిన ఈ వైద్య శిబిరాన్ని మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా కందుల నారాయణరెడ్డి మాట్లాడారు. పోలీసులు అహర్నిశలు శ్రమిస్తున్నారన్నారు. అత్యవసర సమయాల్లో కనీసం విశ్రాంతి కూడా దొరకదన్నారు. ఓ విధంగా చెప్పాలంటే పని ఒత్తిడికి లోనవుతున్నారన్నారు. పోలీస్ కుటుంబాల కోసం ప్రత్యేకంగా ఉచిత వైద్య శిబిరం నిర్వంహించడం అభినందనీయమన్నారు. ఈ శిబిరంలో పట్టణంలోని పోలీస్ కుటుంబ సభ్యులంతా వైద్య సేవలు పొందారు. అవసరమైన పరీక్షలు చేయించుకున్నారు. ఉచితంగా మందుల పంపిణీ జరిగింది. కార్యక్రమంలో డిఎస్‌పి డాక్టర్ యు నాగరాజు, మార్కాపురం సిఐ పి సుబ్బారావు, పట్టణ ఎస్‌ఐలు ఎం సైదుబాబు, డాక్టర్ ఎం రాజమోహన్‌రావు, మార్కాపురం రూరల్ ఎస్‌ఐ పి అంకమరావు తదితరులు పాల్గొన్నారు.
