దళిత కాలనీలో వైద్య శిబిరం

ప్రజాశక్తి-పీసీ పల్లి : ‘జ్వరాలతో దళిత కాలనీవాసులు సతమతం’ అనే శీర్షికన శనివారం ప్రజాశక్తిలో ప్రచురితమైన వార్తకు వైద్యాధికారులు స్పందించారు. స్థానిక ప్రభుత్వ వైద్యురాలు డాక్టర్‌ ఉండేల మంజుల శనివారం దళిత కాలనీలో మెడికల్‌ క్యాంపు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్‌ మంజుల వైద్య సిబ్బందితో కలిసి కాలనీ మొత్తం పర్యటించారు. మురుగునీరు నిల్వ ఉన్న ప్రాంతాలలో మందు స్ప్రే చేయించారు. వీధుల్లో బ్లీచింగ్‌ పౌడర్‌ చల్లించారు. రోగులను పరీక్షించి మందులు అందజేశారు. గ్రామస్తులకు వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత గురించి అవగాహన కల్పించారు. జ్వరాలు, రోగాలు వచ్చినప్పుడు మందులు వాడటమే కాకుండా, ఈ సీజన్లో వ్యాధులు రాకుండా ఉండేందుకు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, నీరు నిల్వ లేకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్త వహించాలని ఆమె గ్రామస్తులకు సూచించారు. ఆమెతో పాటు వైద్య సిబ్బంది ఉన్నారు.

➡️