ముంపు గ్రామాల్లో వైద్య శిబిరాలు నిర్వహించాలి

వరద బాధితులతో మాట్లాడుతున్న ఎంపిపి లక్ష్మి, సిపిఎం నాయకులు

ప్రజాశక్తి-విఆర్‌.పురం

ఇటీవల గోదావరి, శబరి వరదల కారణంగా ముంపునకు గురైన గ్రామాల్లో వైద్యాధికారులు పర్యటించి వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని ఎంపిపి కారం లక్ష్మి, సిపిఎం నాయకులు డిమాండ్‌ చేశారు. ముంపునకు గురైన మండలంలోని కోటారి గొమ్ము, జీడిగుప్ప, సీతంపేట, శ్రీరామగిరి, ముల్కనపల్లి, చొక్కానపల్లి గ్రామాల్లో మంగళవారం ఎంపీపీ, సిపిఎం నాయకులు పర్యటించారు. ఆయా గ్రామాల్లో ప్రజలతో మాట్లాడి వారి బాధలను, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎంపీపీ మాట్లాడుతూ వరదలకు అనేక గ్రామాలు మునగటంతో గ్రామాల్లోని డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్‌, కాళ్ల వాపులతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ఇప్పటికే ఇద్దరు ముగ్గురు మరణించారని తెలిపారు. తక్షణమే వైద్యాధికారులు ఈ గ్రామాలను సందర్శించి సహాయ చర్యలు చేపట్టాలని, వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని కోరారు. వరద ముంపులో 15 రోజుల పాటు ఇళ్లు ఉండడంతో పలు గృహాలు పడిపోయాయన్నారు. పూర్తిగా పడి పోయిన గృహాలకు రూ.2 లక్షలు, దెబ్బతిన్న ఇళ్లకు లక్ష రూపాయలు చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. వరదల కారణంగా పశువులు, మేకలు, గొర్రెలు వ్యాధులకు గురై మరణిస్తున్నాయని, పశువైద్యాధికారులు స్పందించి తక్షణమే హెల్త్‌ క్యాంపులు పెట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు పూనెం సత్యనారాయణ, మండల కార్యదర్శి సోయం చిన్నబాబు, నాయకులు వాళ్ల కృష్ణారెడ్డి, కారం సుందరయ్య, సోడి మల్లయ్య, తోడం రాజు, కమ్మ చిచ్చు నారాయణ, గొంది దారయ్య, ఏ.కాంతారావు, జి.లక్ష్మణరావు, తాతబాబు రెడ్డి, ఎన్‌.రాజు, బాబురావు, మాజీ సర్పంచ్‌ బూబమ్మ, సున్నం సీతమ్మ, వార్డు మెంబర్‌ ఎన్‌.చందర్రావు, టి.నాగేశ్వరావు, కొండారెడ్డి, ఖాదర్‌ పాల్గొన్నారు.

➡️