ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : నరసరావుపేట మండలంలోని లింగంగుంట్లలో జిల్లా కలెక్టర్ పి.అరుణ్‌బాబు మంగళవారం పర్యటించారు. ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛను పున:పరిశీలనలో భాగంగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి వారితో మాట్లాడారు. లబ్ధిదార్ల స్థితిగతులు, ఆరోగ్య పరిస్థితిని తనిఖీ బృందం పరిశీలించింది. అనంతరం కలెక్టర్ స్థానిక మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి మెనూ ప్రకారం ఆహారం అందించాలన్నారు. 10 తరగతి పరీక్షల్లో పాఠశాల విద్యార్థులు నూటికి నూరు శాతం ఉత్తీర్ణత సాధించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. బడి బయట పిల్లలను గుర్తించి బడికి తీసుకురావాలన్నారు. వెనుకబడిన పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. పాఠశాలలో ఉన్న సౌకర్యాల గురించి హెచ్‌ఎంతో మాట్లాడారు. కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బి.రవి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఐ.మురళి, ఎంపిడిఒ టివి కృష్ణ కుమారి పాల్గొన్నారు.
ప్రజాశక్తి – మాచర్ల : మంచానికే పరిమితమైన పింఛనుదారుల అర్హతను ప్రత్యేక డాక్టర్ల బృందం మంగళవారం తనిఖి చేసినట్లు మున్సిపల్ కమిషనర్ డి.వేణుబాబు తెలిపారు. ఎన్‌టిఆర్ భరోసా పథకం కింద పక్షవాతం, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో మంచానికే పరిమితమై రూ.15వేలు చొప్పున పింఛను పొందుతున్న లబ్ధిదారులు పట్టణ పరిధిలో 20 మంది ఉన్నట్లు కమిషనర్ వివరించారు. వీరిని మంగళవారం సాయంత్రం కమిషనర్ వేణుబాబు ఆధ్వర్యంలో వైద్య నిపుణుల బృందం జిజిహెచ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ గోపాలక్రిష్ణ, డాక్టర్ ఎబిఎస్ శ్రీనివాసరావు, వేస్లీ పరిశీలించారు. వీరి స్థితిని లబ్ధిదార్ల ఇంటి నుండే ఆన్‌లైన్ ద్వారా వైద్య నిపుణుల బృందం తమ రిపోర్ట్‌ను ప్రభుత్వానికి పంపుతున్నట్లు వివరించారు.