ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : మెగా పేరెంట్ టీచర్స్ సమావేశాలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని, మధుర స్మతులను మిగిల్చేలా పండగ వాతా వరణంలో నిర్వహించాలని ఉపాధ్యాయులకు కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోరారు. ఎంఇఒలు, హెచ్‌ఎంలతో బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి డిసెంబరు 7న నిర్వహించే ఈ మెగా సమావేశాలపై దిశానిర్దేశం చేశారు. విద్యార్ధులు, వారి తల్లి తండ్రులు, ప్రజాప్రతినిధులు, స్ఫూర్తి దాయక వ్యక్తులను, పాఠశాల పూర్వ విద్యార్థులను, పాఠశాల యాజమాన్య కమిటీని, దాతలను దీనిలో భాగస్వాములను చేయాలని చెప్పారు. అన్ని ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ పాఠశాలలు, ఆదర్శ పాఠశాలలు, కెజిబివిల్లో కూడా ఈ సమా వేశాలు నిర్వహించాలన్నారు. విద్యార్థుల ప్రోగ్రెస్ రిపోర్టును వివరించడంతో పాటు, పాఠశాల అభివృద్ధికి సలహాలు, సూచనలను తీసుకోవాలని చెప్పారు. సమావేశం ఉదయం 9 గంటలకు మొదలై, మధ్యాహ్నం 1 గంటకు చక్కని భోజనంతో ముగుస్తుందని వివరించారు. పాఠశాలకు ఒక ప్రజాప్రతినిధిని మాత్రమే ఆహ్వానించాలని సూచించారు. అదే పాఠశాలలో చదివి ఉన్నత స్థానానికి ఎదిగిన పూర్వ విద్యార్థులను ఈ సమావేశాలకు పిలిచి, వారి విజయగాధలను వివరించి విద్యార్థులను చైతన్యపరచాలని సూచించారు. ఉన్నతాధి కారులు, జిల్లా అధికారులు, మండల ప్రత్యేకాధి కారులు ఒక్కో పాఠశాలకు అతిధులుగా హాజరు అవుతారని తెలిపారు. కల్చరల్ కార్యక్రమాలు నిర్వహించ డంతో పాటు, తల్లితండ్రులకు రంగోలి, టగ్ ఆఫ్ వార్ తదితర పోటీలను నిర్వహిం చాలని అన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో డిఇఒ యు.మాణిక్యం నాయుడు,బిసి సంక్షేమాధికారి పెంటోజీరావు పాల్గొన్నారు.డిసెంబర్ నాటికి చదువు మెరుగుపడాలిఇంటర్ విద్యార్థుల చదువు డిసెంబర్‌లో జరిగే అర్థ వార్షిక పరీక్షలలో మెరుగుపడాలనికలెక్టర్ డాక్టర్ అంబేద్కర్ ప్రిన్సిపాళ్ళను ఆదేశించారు. తన ఛాంబర్‌లో కళాశాల ప్రిన్సిపాళ్లతో బుధవారం సమీక్షించారు . క్వార్టర్లీ పరీక్షలలో జిల్లాలో 18 కళాశాలల్లో పాసైన విద్యార్థుల సంఖ్య 41శాతం మాత్రమేనని , అంత ఎక్కువ మంది ఫెయిల్ కావడానికి గల కారణాలపై ఆరా తీశారు. వెనకబడిన విద్యార్థుల కోసం ప్రత్యేక సమయం తీసుకొని శత శాతం ఫలితాలు వచ్చేలా కృషి చేయాలని అన్నారు. 11 కళాశాలల్లో 50 శాతం కన్నా తక్కువ పాస్ అయ్యారని, వారి పై ఆగ్రహం వ్యక్తం చేశారు. దత్తి రాజేరు మండలంలో 2019లో కళాశాల మంజూరైందని, ఇప్పటికీ స్టాఫ్ గానీ, సదుపాయాలు గాని మంజూరు చేయలేదని, ప్రిన్సిపాల్ కలెక్టర్ దృష్టికి తెచ్చారు. కలెక్టర్ స్పందిస్తూ ప్రభుత్వానికి డిఒ లేఖ రాస్తామని తెలిపారు.