22 మంది సర్పంచులున్నా 9 మందే హాజరు
ఇలా వచ్చి అలా వెళ్లి పోయిన కూటమి ఎంపిటిసిలు
తాగునీటి సమస్య ఉంటే మాదృష్టికి తీసుకురండి : ఎంపిపి
ప్రజాశక్తి – భోగాపురం : సమస్యలపై అధికారులను ప్రశ్నించేందుకు సభ్యులు కరువయ్యారు. దీంతో అధికారులు తమశాఖ చేపడుతున్న వివరాలను ప్రకటించి వెళ్లిపోయారు. ఇది మండల సర్వసభ్య సమావేశం జరిగిన తీరు. ఎంపిపి ఉప్పాడ అనూషరెడ్డి అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం ఎంపిడిఒ కిషోర్ కుమార్ గురువారం నిర్వహించారు. మూడు నెలలకు ఒకసారి ఈ సమావేశాన్ని నిర్వహిస్తుంటారు. ఎన్నికల కోడ్ కారణంగా గత సమావేశం వాయిదా పడింది. దీంతో గురువారం నిర్వహించిన సమావేశానికి ఎన్నడూ లేనివిధంగా సభ్యులు గైర్హాజరు కావడం విశేషం. మండలంలో 22 మంది సర్పంచులు ఉండగా కేవలం 9 మంది మాత్రమే హాజరయ్యారు. కూటమి ఎంపిటిసిలు వచ్చి ఐదు నిమిషాలు కూడా ఉండకుండా వెళ్లిపోవడం విశేషం. దీంతో ఉన్న కొద్దిమంది సభ్యులే తమ పంచాయతీలకు చెందిన కొన్ని సమస్యలపై అధికారులను ప్రశ్నించారు. తాగునీటి పైపులైను మరమ్మతులకు గురైన పట్టించుకోవడంలేదని ముంజేరు సర్పంచ్ నూకరాజు ప్రశ్నించారు. తమ పంచాయతీలో మేట్లను మార్చే ప్రయత్నం చేస్తున్నారని వారంతా వచ్చి తమను ప్రశ్నిస్తున్నారని వైస్ ఎంపిపి రావాడబాబు ఎపిఒ దృష్టికి తీసుకెళ్లారు. మరడపాలెం ఆర్‌అండ్‌ఆర్ కాలనీలోని ఇళ్లు నిర్వాసితుల పేరు మీద రిజిస్ట్రేషన్ లేకపోవడంతో రుణాల తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారని కవులవాడ సర్పంచ్ అన్నారు. నిషేధిత భూ జాబితా నుంచి తొలగించాల్సి ఉందని దీనిని కలెక్టర్ దృష్టిలో పెట్టామని డిటి సుభాష్ తెలిపారు. వేట నిషేదానికి ముందే మత్స్యకార భరోసా రైతుల మత్స్యకారులకు అందజేయాలని బర్రి చిన్నప్పన మత్స్యశాఖ అధికారిని కోరారు. అనంతరం వివిధ సమస్యలను రావాడ సర్పంచ్ పైడినాయుడు, నందిగాం సర్పంచ్ మురళి అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఎంపిపి అనూషరెడ్డి మాట్లాడుతూ వేసవికాలం కావడంతో గ్రామాల్లో తాగునీటి సమస్యలు ఏమైనా ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. వైస్ ఎంపిపి పచ్చిపాల నాగలక్ష్మి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.