చేపల చెరువుల్లో గ’లీజు’

Jan 7,2025 21:48

ప్రజాశక్తి – పాలకొండ : నగరపంచాయితీలో చేపల చెరువు లీజుల విషయంలో గలీజు చోటు చేసుకుంటుంది. పట్టణంలో కాంప్లెక్స్‌ వెనకాల 15 ఎకరాల విస్తీర్ణం కలిగిన వెంకటరాయుని చెరువును చేపల పెంపకానికి అప్పనంగా లీజుకు ఇచ్చేందుకు నగరపంచాయితీ అధికారులు ప్రయత్నిస్తున్నారు. నగరపంచాయితీ ఆదాయానికి గండి కొట్టేలా లీజుకు ఇస్తున్నట్లు తెలుస్తుంది. ఏడాదికి రూ.15వేలు చొప్పున మూడేళ్ల వ్యవధికి లీజుకు ఇచ్చేందుకు సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. దీనిపై నగరపంచాయితీ పాలకవర్గం కూడా మౌనం దాల్చడం చర్చనీయాంశమవుతుంది. మత్స్యకార సంఘాలకు లీజుకు ఇవ్వాల్సి ఉన్నప్పటికీ ఒక వ్యక్తికీ లీజు కట్టబెట్టడానికి ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. బినామీ పేరుతో ఆ వ్యక్తికి లీజు కేటాయించడానికి నగరపంచాయితీ అధికారులు, పాలకవర్గం సిద్ధమవుతున్నట్లు సమాచారం. గత ప్రభుత్వంలో కూడా సదరు వ్యక్తి ఇక్కడ చక్రం తిప్పి లీజు పొందారు. మళ్లీ ఆ వ్యక్తికే లీజుకు కేటాయించడంతో సర్వత్రా ఆరోపణలు వినిపిస్తున్నాయి. నగరపంచాయితీ పరిధిలోని 8 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న కల్యాణి కోనేరు చెరువులో చేపల పెంపరరకానికి నగరపంచాయతీకి ఏడాదికి రూ.45వేలు లీజు రూపంలో, చెరువు శుభ్రం చెయ్యడానికి మరో రూ.30వేలు వసూలు చేశారు. వెంకటరాయుని కోనేరు విషయంలో ఎందుకు ఉదాసీనంగా వ్యవహారిస్తున్నారో తెలియడం లేదు. చేపల పెంపకానికి ఇవ్వదువెంకటరాయుని కోనేరు చేపల పెంపకానికి ఇవ్వొద్దని స్థానిక కౌన్సిలర్‌ కొంచాడ అరుణ్‌, స్థానికులు కోరుతున్నారు. చెరువు శుభ్రం చేసుకుని తాము వాడుకుంటామని దీనిపై అధికారులు దృష్టి పెట్టాలని కోరారు.

➡️