ప్రజాశక్తి-విశాఖ కలెక్టరేట్ : కనీస పెన్షన్ రూ.9వేలు చెల్లించాలంటూ … ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కె.దీనబంధు, ప్రధాన కార్యదర్శి ఎస్.కె. హుస్సేన్ డిమాండ్ చేశారు. మంగళవారం విశాఖ జిల్లాలోని జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ … కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ లో పెన్షనర్లకు మొండిచేయి చూపారని అన్నారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసి ఉద్యోగ విరమణ చేసిన వారికి కనీస పెన్షన్ రూ.9,000 ఇవ్వాలని, హయ్యర్ పెన్షన్ అందరికీ చెల్లించాలన్నారు. హయ్యర్ పెన్షన్ కోసం ఆర్ పిఎఫ్ సి నోటీసులు ఇవ్వటానికి ఉన్న అడ్డంకులను తొలగించాలని కోరారు. పెన్షనర్లకు ఉచిత మెడికల్ సౌకర్యం కల్పించాలని, రైల్వే చార్జీలో 50 శాతం రాయితీ పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. యూనియన్ జిల్లా కార్యవర్గ సభ్యులు వై. అప్పారావు ధర్నా శిబిరాన్ని ప్రారంభించారు. రాష్ట్ర కార్యదర్శి కె.సుధాకర్ మాట్లాడుతూ …. పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఢిల్లీలో మూడు రోజులు పాటు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని ప్రకటించారు. ఇందులో భాగంగా ఈరోజు ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ధర్నా ఉంటుందన్నారు. బుధవారం ఢిల్లీలో జాతీయ స్థాయి సదస్సు ఉంటుందన్నారు. గురువారం అన్ని పార్టీల ఎంపీలను కలిసి వినతిపత్రాలు ఇస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు కె.ఎం కుమార మంగళం, వి. తులసీరామ్, చిట్టివలస జూట్ మిల్లికి చెందిన నాయకులు బాబాజీ, వానపల్లి కాశిబాబు, రాంప్రభు,డి. విజ్ఞానంద్ తదితరులు పాల్గొన్నారు.
కనీస పెన్షన్ రూ.9 వేలు ఇవ్వాలి : ఆల్ పెన్షనర్స్ భారీ ధర్నా
