ప్రజాశక్తి-కలక్టరేట్ (కృష్ణా) : మచిలీపట్నం నగర అభివృద్దే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర గనులు భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. ఆదివారం మంత్రి, ఏపీఎస్‌ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావుతో కలిసి మచిలీపట్నం నగరంలోని 19వ డివిజన్లో రూ.14.48 లక్షల విలువైన సిఎస్‌ఆర్ నిధులతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ఆ డివిజన్లో రూ.5.70 లక్షల వ్యయంతో పైలాన్ పార్కుకు కాంపౌండ్ వాల్, అదేవిధంగా పార్కులో రూ.8.78 లక్షల వ్యయంతో వాకింగ్ ట్రాక్ నిర్మాణం పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ ప్రాంతం బ్రిటిష్ కాలం నాటి నుంచి ఎంతో చరిత్ర కలిగి ఉందని వివరిస్తూ 1990లో వచ్చిన తుఫాను కారణంగా బందరు పట్టణం ముంపుకు గురైందని, దానికి గుర్తుగా ఆ సమయంలో ప్రపంచ బ్యాంకు నిధులతో నిర్మించిన పైలాన్ ను అప్పటి ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి ప్రారంభోత్సవం చేసిన సంఘటనను మంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రస్తుతం ఈ పైలాన్ పార్క్ లోతట్టు ప్రాంతం కావడంతో ఎవరికీ ఉపయోగము లేకుండా పోయిందని, దీనిని మెరక చేయించి, అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో మొదటి దశగా దాదాపు రూ.15 లక్షల వ్యయంతో పార్కుకు ప్రహరీ గోడ, వాకింగ్ ట్రాక్ నిర్మించేందుకు నిధులను వెచ్చిస్తున్నామన్నారు. అదేవిధంగా పిల్లల కోసం స్కేటింగ్ కోర్టు ఏర్పాటుకు ప్రతిపాదనలు రూపొందిస్తున్నామని, వేగంగా పార్కు సుందరీకరణకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు. దీనికి సమీపంలోని పోర్ట్ రోడ్డును మచిలీపట్నం రైల్వే స్టేషన్ నుంచి మూడు స్తంభాల సెంటర్ వరకు 80 అడుగుల వెడల్పుతో రోడ్డును విస్తరించేందుకు చర్యలు చేపట్టినట్లు మంత్రి తెలిపారు. అదేవిధంగా ఇటీవల రహదారులకు ఇరువైపులా ఆక్రమణలను తొలగించిన విషయాన్ని మంత్రి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ నగరంలోని డ్రైనేజీ వ్యవస్థపై ప్రత్యేక దఅష్టి సారించామని, త్వరలో వాటికి కూడా నిధులను తీసుకురానున్నట్లు మంత్రి తెలిపారు. రాజకీయాలు శాశ్వతం కాదని, రాజకీయాలకతీతంగా పాలకవర్గ సభ్యులు నగర అభివృద్ధికి సహకరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు బండి రామకృష్ణ, కొనకళ్ళ జగన్నాధరావు (బుల్లయ్య), జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గొర్రెపాటి గోపీచంద్,మున్సిపల్ మాజీ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్, నగర మున్సిపల్ కమిషనర్ బాపిరాజు తదితరులు పాల్గొన్నారు.
