ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : శ్రీ పైడితల్లి అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పట్టు వస్త్రాలను సమర్పించారు. ఆయన కుటుంబ సమేతంగా మంగళవారం ఉదయం అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించే అవకాశం దక్కడం తన అదృష్టం అని అన్నారు. ఈ అవకాశాన్ని కల్పించిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి లకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. సినిమానోత్సవానికి పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి చెప్పారు. ఎంపీ కలిసెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతిరాజు జిల్లా యంత్రాంగాన్ని నిరంతరం సమన్వయం చేసుకుంటూ, భక్తులకు ఇబ్బంది రాకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారని తెలిపారు. నిర్ణీత సమయానికి అమ్మవారి సిరిమానోత్సవాన్ని ప్రారంభించేందుకు చర్యలు తీసుకున్నామని చెప్పారు. పోలీసులు కూడా భక్తులకు చక్కని సహకారాన్ని అందిస్తున్నారని, జాతరకు వచ్చే భక్తులను అతిధులుగా చూడాలని పోలీసులను ఇప్పటికే ఆదేశించామని మంత్రి తెలిపారు. ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు మాట్లాడుతూ, సిరిమానోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. ఈ ఉత్సవాల్లో స్వయంగా పాల్గొనే అవకాశం రావడం తమ అదృష్టమని ఆయన పేర్కొన్నారు. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఉత్సవాల ఏర్పాట్లపై నిరంతరం పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. ప్రజలకు సేవ చేసే అవకాశం రావడం తమ బాధ్యతగా భావిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.
పైడితల్లి అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించిన మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు
