ప్రజాశక్తి-మంగళగిరి (గుంటూరు) : మంగళగిరి పట్టణం టిడ్కో కాలనీలో దివీస్ లేబరేటరీస్ సంస్థ సహకారంతో ఏర్పాటు చేసిన ఆర్వో మినరల్ వాటర్ ప్లాంట్ ను ఆదివారం విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. ముందుగా టిడ్కో కాలనీకి చేరుకున్న మంత్రి లోకేష్ కు స్థానిక ప్రజానీకం, కూటమి నేతలు ఘన స్వాగతం పలికారు. మహిళలు హారతి ఇచ్చి మంత్రి లోకేష్ కు స్వాగతం పలికారు. అనంతరం రిబ్బన్ కట్ చేసి వెయ్యి లీటర్ల సామర్థ్యం ఉన్న ఆర్వో మినరల్ వాటర్ ప్లాంట్ ను మంత్రి లాంఛనంగా ప్రారంభించారు. ప్లాంట్ మొత్తం కలియతిరిగి దివీస్ ప్రతినిధులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం వాటర్ క్యాన్ ను మంచినీటితో నింపి మహిళలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో దివీస్ సంస్థ సీఎస్‌ఆర్ హెడ్ జి.నగేష్, కార్పొరేషన్ కమిషనర్ ఎస్ ఆల్ భాష, కూటమి నేతలు పాల్గొన్నారు.
ఆర్వో మినరల్ వాటర్ ప్లాంట్ ను ప్రారంభించిన మంత్రి లోకేష్
