ప్రజాశక్తి – తుళ్లూరు (గుంటూరు) : రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు అన్యాయం జరగదని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖా మంత్రి పి.నారాయణ అన్నారు. మంగళవారం మంత్రి రాజధాని ప్రాంతం అనంతవరంలో అమరావతి నిర్మాణానికి వినియోగించే గ్రావెల్ లభ్యత కోసం కొండలను మంత్రి, మైనింగ్ అధికారులు కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా విలేకరులతో మంత్రి మాట్లాడుతూ …. ఇప్పటికే రాజధాని నిర్మాణానికి 33 వేల ఎకరాలు రైతులు ఇచ్చారని, మరో 44 వేల ఎకరాలు తీసుకోనున్నట్లు ప్రభుత్వం ప్రకటించడంతో రైతులు ఆందోళన చెందుతున్నారని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. తామిచ్చిన భూములను అభివృద్ధి చేయకుండా మరో 44 ఎకరాలు తీసుకోవడంపై రైతులు అసహనం వ్యక్తం చేస్తున్నారని అడగ్గా … రైతులు ఆందోళన చెందవలసిన అవసరం లేదన్నారు. రాజధాని లో రూ 64,912 కోట్లతో పనులను ప్రారంభించామన్నారు. గత ప్రభుత్వ నిర్వాకంతో రాజధాని పనుల ప్రారంభానికి ఆటంకాలు వచ్చాయన్నారు. న్యాయపరమైన సమస్యలు అధిగమించేందుకు 8 నెలలు పట్టిందని చెప్పారు. అమరావతి పనులకు అవసరమైన గ్రావెల్ కోసం గనుల శాఖ 851 ఎకరాలను సి ఆర్ డి ఎ కు కేటాయించిందని చెప్పారు. గతంలో అనంతవరం కొండను సి ఆర్ డి ఎ కు కేటాయించగా గత ప్రభుత్వంలో 8 మీటర్ల లోతు వరకూ తవ్వేశారని అన్నారు. తవ్విన ప్రాంతాన్ని ఏదైనా అవసరానికి ఉపయోగించాలని చూస్తున్నామని మంత్రి చెప్పారు. రాజధాని నిర్మాణానికి మరో 44 వేల ఎకరాలు ఎందుకు.. అని అడగ్గా … రాజధానిలో ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు కట్టాలనేది ముఖ్యమంత్రి ఆలోచనని అని మంత్రి వెల్లడించారు. మంగళగిరి, తాడేపల్లి, గుంటూరు, విజయవాడ లను కలిపి మెగాసిటీ గా చేయాలనేది లక్ష్యమన్నారు. ఎయిర్ పోర్టు కోసం కనీసం 5 వేల ఎకరాలు అవసరమనీ, ల్యాండ్ పూలింగ్ ద్వారా అయితే రైతులకు భాగస్వామ్యం కల్పించడం, అభివఅద్ధి పనులకు 30 వేల ఎకరాలు అవసరం అవుతుందన్నారు. భూసేకరణ ద్వారా తీసుకుంటే రైతులు నష్టపోతారని, సమీకరణ చేయాలని స్థానిక ఎమ్మెల్యే లు కోరారని మంత్రి చెప్పారు. భూ సేకరణ.. భూ సమీకరణ అన్న దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. అమరావతి నిర్మాణాన్ని మూడేళ్లలో పూర్తి చేస్తామన్నారు. మంత్రి వెంట మైనింగ్ శాఖాధికారులతో పాటు సి ఆర్ డి ఎ, రెవెన్యూ అధికారులు ఉన్నారు.
రాజధానికి భూములిచ్చిన రైతులకు అన్యాయం జరగదు : మంత్రి నారాయణ
