రాష్ట్రంలో రూ.4,500 కోట్లతో 30 వేల పనులు ప్రారంభం : మంత్రి నిమ్మల

Oct 14,2024 13:06

పాలకొల్లు (పశ్చిమ గోదావరి) : ఈరోజు నుంచి ప్రారంభం అవుతున్న పల్లె పండుగలో రాష్ట్ర వ్యాప్తంగా రూ. 4500 కోట్లతో 30 వేల పనులు చేపడుతున్నట్లు రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. సోమవారం పాలకొల్లు నియోజకవర్గంలో నిర్వహించిన పల్లె పండుగ వారోత్సవాల్లో భాగంగా మండలంలోని గోరింటాడ, సగం చెరువు గ్రామాల్లో జరిగిన కార్యక్రమాల్లో మంత్రి నిమ్మల పాల్గొని అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ … సంక్రాంతిలోపు గ్రామ గ్రామాన ఇంటింటికి 3 వేల కిలోమీటర్ల సిసి రహదారులు పూర్తిచేయాలని లక్ష్యంగా పనిచేస్తున్నట్లు చెప్పారు. గత ప్రభుత్వంలో పంచాయతీలను నిర్వీర్యం చేసి సర్పంచులను భిక్షాటన చేసేలా చేస్తే నేటి ప్రభుత్వం పంచాయతీల ఆర్థిక పరిపుష్టిని పెంచి గౌరవంగా తలెత్తుకునేలా చేస్తున్నట్లు చెప్పారు. గత పాలనలో పంచాయతీ నిధులను కూడా దారి మళ్లించిన స్థానిక సంస్థల ద్రోహి జగన్‌ అని మంత్రి రామానాయుడు విమర్శించారు. బాపూజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం ఎన్డీఏ ప్రభుత్వంతో సాధ్యమవుతుంది అన్నారు. ఒకే రోజు 13326 పంచాయితీ గ్రామసభలు అభివృద్ధి పనులకై తీర్మానాలు చేయడం చరిత్రలో చారిత్రాత్మకం అని మంత్రి రామానాయుడు అన్నారు.

➡️