ప్రజాశక్తి-రాచర్ల : ప్రకాశం జిల్లాను, ముఖ్యంగా పశ్చిమ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించినట్లు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి తెలిపారు. రాచర్ల మండలం యడవల్లి గ్రామ పరిధిలో గల 25 ఎకరాల విస్తీర్ణం గల భూమిలో, గిద్దలూరుకు 6 కిలోమీటర్ల దూరంలో అమరావతి టు అనంతపూర్ రాష్ట్రీయ ప్రధాన రహదారి పక్కన శనివారం లిడ్ క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యాలరావు, గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డిలతో కలిసి లెదర్ పార్క్ నిర్మాణానికి మంత్రి బాల వీరాంజనేయ స్వామి భూమి పూజ, శంకుస్థాపన చేశారు. అమరావతి టు అనంతపూర్ ప్రధాన రహదారి నుంచి లెదర్ పార్కు ప్రాజెక్టు వరకు 70 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించే రోడ్డుకు కూడా మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి బాల వీరాంజనేయ స్వామి మాట్లాడుతూ పేదలకు నిరుద్యోగులకు ఈ లెదర్ పార్కు పరిశ్రమ ఎంతగానో తోడ్పడుతుందని అన్నారు. రాష్ట్రంలో పరిశ్రమలను స్థాపించి 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందన్నారు. అందుకనుకూలంగా ఇప్పటివరకు రాష్ట్రంలో 6.50 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులను తీసుకువచ్చినట్లు తెలిపారు. కనిగిరి ప్రాంతంలో పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్ట్, కందుకూరు, రామాయపట్నం ప్రాంతాలలో రిఫైనరీ ప్రాజెక్టులను ప్రారంభించిందన్నారు. ప్రభుత్వం ఈ రెండు ప్రాజెక్టుల ద్వారా ఇప్పటివరకు నాలుగు లక్షల ఉద్యోగాలకు అవకాశం కల్పించిందన్నారు. ఎస్సీ కార్పొరేషన్, లిడ్ క్యాప్‌లకు పూర్వ వైభవం తీసుకురావడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. పరిశ్రమల స్థాపనకు లిడ్ క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యాలరావు అందించిన కృషి అభినందనీయమన్నారు. లిడ్ క్యాప్ భూములు అన్యాక్రాంతం కాకుండా చూస్తామని, ఎస్సీ ఎస్టీలు పరిశ్రమలు స్థాపించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో లిడ్ క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యాలరావు మాట్లాడుతూ పశ్చిమ ప్రాంత అభివృద్ధికి ఇక్కడ ఈ రోజు లెదర్ పార్కును ప్రారంభించినట్లు తెలిపారు. ఈ పరిశ్రమ నిర్మాణానికి ప్రభుత్వం 5.75 కోట్ల రూపాయలు కేటాయించి నిధులు కేటాయించిందన్నారు. లెదర్ పార్క్ నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని కాంట్రాక్టరును ఆదేశించారు. లెదర్ పార్క్‌కు అనుబంధంగా ఇతర పరిశ్రమలు కూడా ఇక్కడ ఏర్పడే అవకాశం ఉందని, ప్రభుత్వం కోరితే పోలీసు, ఇతర ప్రభుత్వ శాఖలకు సంబంధించిన బూట్లు, ఇతర లెదర్ వస్తువులు అందించేలా ఈ పరిశ్రమను అభివృద్ధి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుముల అశోక్‌రెడ్డి మాట్లాడుతూ వెనుకబడిన పశ్చిమ ప్రకాశం అభివృద్ధి లక్ష్యంగా జిల్లాలో మొదటి సారిగా గిద్దలూరు నియోజకవర్గంలో లెదర్ పార్కు పరిశ్రమను దాని అవసరమైన రోడ్డు మంజూరు చేయించి ప్రారంభించిన మంత్రి డోలాకు ధన్యవాదాలు తెలిపారు. చర్మకారులు ఎస్సీ, ఎస్టీలు ఎక్కువగా ఉన్న ఈ ప్రాంతంలో తోళ్ల ను శుద్ధి చేసే యూనిట్ కూడా ఇక్కడ స్థాపించి వారి అభివృద్ధికి మరింత తోడ్పాటును అందించాలని మంత్రిని ఎమ్మెల్యే కోరారు. ఈ కార్యక్రమంలో డిఆర్డిఏ పీడీ రవికుమార్, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి లక్ష్మానాయక్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ అర్జున్ నాయక్, ఏపీ ఈడబ్ల్యూ ఐడీసీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పి భాస్కర్ బాబు, రాచర్ల ఎంపీడీఒ సూరె వెంకట రామిరెడ్డి, తహశీల్దార్ ఎం ఆంజనేయరెడ్డి, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
